కాంగ్రెస్ లో కొత్త పంచాయితి

తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త పంచాయితీ మొదలైంది. ఈ పంచాయితీకి అడ్వర్టైజ్మెంట్లు ప్రధాన కారణం కావటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణా ప్రభుత్వం జారిచేసిన కొన్ని అడ్వర్టైజ్మెంట్లలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫొటోలు మిస్సయ్యాయి. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోతో పాటు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫొటో కూడా తప్పనిసరిగా కనబడుతోంది. సీఎంతో పాటు డిప్యుటి సీఎం ఫొటోను అడ్వర్టైజ్మెంట్లలో చూపించాలన్నది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.

ఆ నిర్ణయానికి తగ్గట్లే ప్రతి ప్రకటన అది దినపత్రికల్లో కావచ్చు, పోస్టర్లలో కావచ్చు, చివరకు హోర్డింగుల్లో అయినా రేవంత్, బట్టి ఫొటోలు ఉంటున్నాయి. కాని తాజాగా అంటే సోమవారం ప్రభుత్వం జారిచేసిన అడ్వర్టైజ్మెంట్ లో కేవలం రేవంత్ రెడ్డి ఫొటో మాత్రమే ఉన్నది. భట్టి ఫొటో ఎందుకు మిస్సయ్యిందనే విషయం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రజాపాలనలో కొలువుల పండుగ పేరుతో ప్రభుత్వం ఒక ప్రకటన జారిచేసింది. అందులో గడచిన మూడునెలల్లో 5192 టీచర్లు, డాక్టర్లు, లెక్చిరర్లు, మెడికల్ స్టాప్, కానిస్టేబుళ్ళ ఉద్యోగాలిచ్చినట్లు అందులో ఉంది.

ఈ 5192 మంది అపాయిట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో పెద్దగా నిర్వహించింది. దీనికోసమనే ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు జారీచేసింది. రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే ముందే అనుసరించాల్సిన ప్రోటోకాల్ ను అధిష్టానం స్పష్టంగా నిర్దేశించిందట. దాని ప్రకారం ప్రభుత్వం జారీచేసే ప్రతి అడ్వర్టైజ్మెంట్లోను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫొటో కూడా రేవంత్ ఫొటోతో పాటు ఉండితీరాల్సిందే అని చెప్పిందని పార్టీవర్గాలు చెప్పాయి. అంత స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికి ఇప్పుడు డిప్యుటి సీఎం ఫొటో ఎందుకు మిస్సయ్యిందనే పంచాయితీ మొదలైంది.

ఇదే విషయమై భట్టీ కార్యాలయంతో పాటు పార్టీలో ఆయన మద్దతుదారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రకటనను జారీచేసిన సమాచార పౌర సంబంధాల శాఖ ఉన్నతాధికారులను డిప్యుటి సీఎం కార్యాలయం వివరణ అడిగినట్లు తెలుస్తోంది. ఇపుడు మొదలైన పంచాయితి చివరకు ఎక్కడిదాకా వెళుతుందో తెలీటంలేదు. ఎవరి ఆదేశాల మేరకైనా భట్టి ఫొటో తీసేశారా ? లేకపోతే పొరబాటు జరిగిందా అన్నది ఇక్కడ కీలకమైంది. చివరకు ఏమి తేలుతుందో చూడాలి.