కాళేశ్వరం నాలుగు నెలలు షట్ డౌన్

అనుకున్నంతా అయ్యింది. తెలంగాణాలోని కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టులను నాలుగు నెలల పాటు షట్ డౌన్ చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల్లో రిపేర్లు చేయాల్సి రావటమే. ఈ మూడు ప్రాజెక్టులు ఉపయోగంలో లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాదనే చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు నింపాలంటే ముందు పై మూడు ప్రాజెక్టుల్లో నీటి నిల్వ చేయాలి. ఇపుడు ఈ ప్రాజెక్టులకు జరిగిన డ్యామేజీ ప్రకారం చూస్తే నీటి నిల్వ సాధ్యం కాదు.

అందుకనే దాదాపు రెండు నెలల క్రితం మేడిగడ్డలో, ఈ మధ్యలోనే అన్నారం, సుందిళ్ళలో నీటిని బయటకు పంపేశారు. విషయం ఏమిటంటే మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కొన్ని కుంగిన విషయం తెలిసిందే. దీని ఫలితంగా బ్యారేజి గోడలు కూడా అక్కడక్కడ బీటలొచ్చేశాయి. దాంతో ఈ బ్యారేజిలో నీటిని నిల్వ ఉంచేందుకు లేదని నిపుణులు చెప్పారు. దాంతో బ్యారేజిలోని నీటినంతా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు బయటకు పంపేశారు. అలాగే అన్నారం ప్రాజెక్టు గేట్లు పగిలిపోయాయి. ఈ పగుళ్ళలోనుండి నీరుంతా బటయకు లీకైపోతోంది. లీకులు మరీ ఎక్కువైతే గేట్లు తర్వాత డ్యామ్ ప్రమాదంలో పడుతుంది.

అందుకనే గేట్లెత్తేసి ఇందులోని నీటిని బయటకు వదిలేశారు అధికారులు. సుందిళ్ళ ప్రాజెక్టు సమస్య కూడా దాదాపు ఇలాంటిదే. ఈ మూడు ప్రాజెక్టులను రిపేర్లుచేస్తే కాని నిటినిల్వ సాధ్యంకాదు. ప్రాధమికంగా ప్రాజెక్టులను పరిశీలించిన నిపుణులు ఈ ప్రాజెక్టులు పనికిరావని తేల్చేశారు. అందుకనే క్రాస్ చెక్ చేయటంకోసం కేంద్రప్రభుత్వంలోని జలవనరుల మంత్రిత్వశాఖ నిపుణులను రమ్మని ప్రభుత్వం ఆహ్వానించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి (ఎన్డీఎస్ఏ) నుండి ఆరుగురు సభ్యుల నిపుణుల బృందం అద్యయనం కోసం వస్తున్నది.

ఈ బృందం వచ్చి అధ్యయనంచేసి ఏదో ఒక నిర్ణయం చెప్పేంతవరకు నీటిని నిల్వ చేయద్దని జలవనరుల శాఖ ఉన్నతాదికారులు రాష్ట్రప్రభుత్వానికి చెప్పారు. అంటే బృందం పరిశీలన, మరమ్మత్తుల విషయంపై నిర్ణయం తీసుకోవటం లాంటివి జరగాలంటే కనీసం నాలుగు నెలలు పడుతుందని అంచనా వేశారు. అందుకనే పై ప్రాజెక్టులను నాలుగు నెలలపాటు మూసేయాలని ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ఉన్నతాదికారులను ఆదేశించింది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.