పాల్ పార్టీలో చేరిక‌లు.. ఔను.. నిజం!

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, శాంతి దూత కిలారి ఆనంద‌పాల్‌.. నిజంగానే ఆనందంలో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు. ఎందుకం టే.. ఇప్పుడు కీల‌క‌మైన‌పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న పార్టీలోకి చేరిక‌లు పెరుగుతున్నాయి. నిజ‌మే. గిట్టివారు ఒప్పుకోక‌పోయినా.. క్షేత్ర‌స్థాయిలో త‌న పార్టీ ప‌రుగులు పెట్ట‌డం, ఢిల్లీకోట‌ను బ‌ద్ద‌లుకొట్ట‌డం ఖాయ‌మ‌ని పాల్ చెబుతున్నారు. తాజాగా పాల్ పార్టీ ప్ర‌జాశాంతి పార్టీలోకి మాజీ మంత్రి, ఎస్సీ నాయ‌కుడు బాబూ మోహ‌న్ చేరిపోయారు. పార్టీ కండువా క‌ప్పుకొన్నారు.

కేఏ పాల్ సమక్షంలో సినీ హాస్య న‌టుడు, పాయే ఫేమ్‌.. బాబుమోహన్ ప్ర‌జాశాంతి పార్టీ కండువా కప్పుకొన్నారు. కొద్ది రోజుల క్రిత‌మే ఆయ‌న‌ బీజేపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ విధానాలు త‌న‌కు న‌చ్చ‌లేద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో పాల్ నేతృత్వంలోని పార్టీపై ఆయ‌న పొగ‌డ్త‌ల జ‌ల్లు కురిపించారు. నిశ్వార్థంగా ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్న పాల్ వెంట న‌డిచేందుకు తాను, త‌న అనుచ‌రులు రెడీగా ఉన్నార‌ని గ‌త రెండు రోజుల కింద‌ట వ్యాఖ్యానించారు. ఇంకేముంది.. పాల్ ఆయ‌న‌ను వెంట‌నే పిలుచుకొచ్చి.. పార్టీ కండువా క‌ప్పేసి.. షేక్ హ్యాండ్ ఇచ్చేశారు.

బాబు మోహన్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ తరపున వరంగల్ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ప్రచారం ప్రారంభించి విజయం సాధిస్తామని బాబు మోహన్ ధీమా వ్యక్తం చేశారు. పాల్ కూడా.. ఆయ‌న‌కు న‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయొచ్చ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇద‌లావుంటే.. బాబూ మోహ‌న్ రాజ‌కీయ ప్ర‌స్తానం.. టీడీపీతో ప్రారంభ‌మైంది. అప్ప‌ట్లోనే ఆయ‌న కార్మిక శాఖ మంత్రిగా ప‌నిచేశారు. ఆత‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో బీఆర్ ఎస్(అప్ప‌టి టీఆర్ ఎస్‌) లో చేరారు.

ఆందోల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచారు. అయితే.. త‌ర్వాత కాలంలో ఈయ‌నకు స్థానిక నేత‌ల‌కు మ‌ధ్య వివాదాలు రావ‌డంతో పార్టీలో గ్యాప్ పెరుగుతూ వ‌చ్చింది. గ‌త 2018 ఎన్నిక‌ల్లో పార్టీ టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో కేసీఆర్‌పై అలిగి క‌మ‌లం గూటికి చేరుకున్నారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి 2018, 2023లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా బాబుమోహన్ పోటీ చేశారు. ఇక‌, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఆయ‌న వ‌రంగ‌ల్ టికెట్ ఆశించగా బీజేపీ అధిష్టానం వేరే వారికి ఇచ్చింది. దీంతో పాల్ పార్టీలోకి బాబూ మోహ‌న్ చేరిపోయారు.