జనసేన అభ్యర్ధిని మారుస్తున్నారా ?

పార్టీలో ఇపుడి విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. విషయం ఏమిటంటే విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తోంది. ఈ నియోజకవర్గం నుండి పోటీచేయాలని టీడీపీ సీనియర్ నేత కళావెంకటరావు చాలా ప్రయత్నాలు చేసినా కుదరలేదు. సీట్ల సర్దుబాటులో నెల్లిమర్ల జనసేన ఖాతాలోకి వెళ్ళింది. దాంతో ఇక్కడి నుండి లోకం మాధవి పోటీ చేస్తుందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ప్రకటనకు ముందునుండే మాధవి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రకటన తర్వాత టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి మంచి జోరుమీద అందరినీ కలుస్తున్నారు.

ఇక్కడే టికెట్ విషయం ట్విస్టు తీసుకున్నది. అదేమిటంటే లోకం మాధవిని అభ్యర్ధిగా చాలామంది వ్యతిరేకించటం మొదలుపెట్టారు. మాధవికి గెలుపు అవకాశాలు లేవని లోకల్ నేతలు పవన్ కు చెబుతున్నారు. జనసేన పోటీచేయబోయే 24 నియోజకవర్గాల్లో ప్రకటించిందే ఐదుగురు అభ్యర్ధులను. ఈ ఐదుగురిలో లోకంమాధవిపై ఇటు జనసేన అటు టీడీపీ నేతల నుండి అభ్యంతరాలు పెరిగిపోతున్నాయి. ఇపుడు మాధవి విషయంలో సమస్య ఏమొచ్చిందంటే ఆమె సామాజికవర్గమే.

ఎలాగంటే మాధవిది బ్రాహ్మణ సామాజిక వర్గం. ఆమె భర్త లోకం ప్రసాద్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కాపు. నెల్లలిమర్లలోని ఓటర్లలో ఎక్కువగా బీసీ సామాజికవర్గానికి చెందిన తూర్పుకాపులున్నారు. కాబట్టి మాధవికి టికెట్ ఇస్తే బీసీలు ఓట్లేయరనే చర్చ రెండుపార్టీల నేతల్లో బాగా జరుగుతోంది. అందుకనే మాధవిని వెంటనే మార్చాలని చాలామంది నేతలు పవన్ దగ్గర గట్టిగా చెబుతున్నారట. అందుకనే మాధవిని నెల్లిమర్ల నుండి కాకుండా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పోటీచేయించే విషయాన్ని పవన్ ఆలోచిస్తున్నారట.

విశాఖపట్నం నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో దక్షిణ నియోజకవర్గమే చిన్నది. ఈ నియోజకవర్గంలో బీసీలు, బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయట. గతంలో బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ద్రోణంరాజు సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్ గెలిచిన విషయం తెలిసిందే. సామాజికవర్గాల కోణంలో నెల్లిమర్లలో పనికిరాని మాధవి విశాఖ దక్షిణం నియోజకవర్గంలో ఎలాగ పనికొస్తుందని నేతలు అనుకుంటున్నారో తెలీదు. పోనీ మాధవి ప్లేసులో టికెట్ ఆశిస్తున్న నేతలు బాగా గట్టివారా అంటే కాదు. మరి అభ్యర్ధిత్వం విషయంలో పవన్ ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.