ఏపీలో కోటిమందిని టచ్ చేసి వెళ్లిన కరోనా

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న కొత్తలో వైరస్ పై ప్రజల్లో పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల విపరీతంగా భయపడేవారు. క్రమక్రమంగా కరోనా లక్షణాలు, చికిత్స పై అవగాహన పెరగడంతో…కరోనాకు అతిగా భయపడకుండా అప్రమత్తంగా ఉంటున్నారు. తీవ్ర లక్షణాలు ఉన్నవారు మాత్రం ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఒక వేళ చాలామందిలో స్వల్ప లక్షణాలు కనిపించినా…వెంటనే హోం క్వారంటైన్ లో చికిత్స పొంది కరోనా నుంచి బయటపడుతున్నారు. ఇక, చాలామంది తమకు కరోనా వచ్చి వెళ్లిన సంగతే తెలీదని…ఇప్పటికి ఒక్కసారైనా వచ్చి పోయి ఉంటుందని చెప్పుకుంటున్నారు. స్వల్ప లక్షణాలు, అసలు లక్షణాలు లేకుండా చాలామందిని కరోనా టచ్ చేసి వెళ్లిపోయిందని అనుకుంటున్నారు. వారంతా అనుకున్నట్టుగానే ఏపీలో 19.7 శాతం మందికి కరోనా వచ్చి పోయిందని సీరో సర్వేలెన్స్ ఫలితాల్లో వెల్లడైంది. ఏపీ జనాభాలో సుమారుగా కోటి మందిని కరోనా టచ్ చేసి వెళ్లిందని సర్వేలో వెల్లడైంది.

కమ్యూనల్‌ డీసీజ్‌ ఎంత తీవ్రస్థాయిలో ఉందో తెలుసుకోవడం కోసం సీరో సర్వేలేన్స్‌ చేపడతారని, హరియాణా తర్వాత ఏపీలోనే ఈ తరహా సీరో సర్వే చేపట్టామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్ వెల్లడించారు. పురుషుల్లో 19.5 శాతం, మహిళల్లో 19.9 శాతం మందికి కరోనా వచ్చివెళ్లిందని వెల్లడించారు. పట్టణాల్లో 22.5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 18.2 శాతం మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో 20.5 శాతం, నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో 19.3 శాతం మందికి, హై రిస్క్ పాపులేషన్ జోన్లలో 20.5 శాతం మందికి కరోనా వచ్చి పోయిందని తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆగస్టు నెలలో రెండు దఫాలుగా సీరో సర్వైలెన్స్ సర్వే నిర్వహించామని అధికారులు తెలిపారు. ప్రతి జిల్లాలో ఐదు వేల మంది శాంపిల్స్‌ టెస్ట్‌ చేశామన్నారు. పూర్తిగా ఏ లక్షణాలు లేని వారి మీద కూడా ఈ సర్వే చేపట్టామన్నారు . ఈ సర్వే ద్వారా త్వరలోనే కర్నూల్, విజయనగరం జిల్లాలో కేసులు తగ్గుముఖం పడతాయని అంచనా వేశామన్నారు‌. త్వరలోనే చిత్తూరు, విశాఖలో కేసులు తగ్గుముఖం పట్టనుండగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఆ జిల్లాలో పరీక్షలు ఎక్కువగా చేసి, బెడ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు.