న్యూస్ ఛానెల్ ముందు స్టార్ డైరెక్టర్ సంచలనం

జాతీయ న్యూస్ టీవీ ఛానెళ్లలో రిపబ్లిక్ టీవీ తీరు ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. ఆ ఛానెల్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అనుకూలం అన్నది అందరికీ తెలిసిన విషయమే. దేశంలో తనకున్నంత దేశభక్తి ఇంకెవరికీ లేదన్నట్లుగా ప్రొజెక్ట్ చేసుకునే ఆ ఛానెల్ అధినేత అర్నాబ్ గోస్వామి.. లౌకిక వాదులని చెప్పుకునే రాజకీయ, సినీ ప్రముఖుల మీద విరుచుకుపడుతుంటాడు. చాలామంది మీడియా వాళ్లు ఒక ప్రశ్న వేయడానికి భయపడే వ్యక్తుల మీద అర్నాబ్ ఎలా విరుచుకుపడుతుంటాడో.. టీవీ చర్చల్లో ఎలా వాళ్ల నోళ్లు ఎలా మూయిస్తుంటాడో తెలిసిందే. ఐతే అర్నాబ్ ధాటికి భయపడి అతడి జోలికి చాలామంది సెలబ్రెటీలు వెళ్లరు. ఐతే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. గురువారం రిపబ్లిక్ టీవీ ఛానెల్ ముందు చేసిన పని సంచలనం రేపింది.

గతంలో ఓసారి విమానంలో వెళ్తూ అర్నాబ్‌తో గొడవ పెట్టుకున్న స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాతో కలిసి అనురాగ్ గురువారం ముంబయిలోని రిపబ్లిక్ టీవీ ఛానెల్ ఆఫీస్ వద్దకు వెళ్లాడు. వీళ్లిద్దరూ చెప్పును లామినేట్ చేసిన ఫొటో ఫ్రేమ్‌లను చేతిలో పెట్టుకుని అక్కడికి వెళ్లడం గమనార్హం. జర్నలిజంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న అర్నాబ్‌‌కు పురస్కారాల రూపంలో ఈ ఫొటో ఫ్రేమ్‌లు ప్రదానం చేయడం కోసం అనురాగ్, కునాల్ అక్కడికి వెళ్లారు. అర్నాబ్‌ను కలిసేందుకు లోపలికి వెళ్లాలని ప్రయత్నించిన వీరిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఐతే వీళ్లేమీ పెద్దగా గొడవ చేయకుండా వచ్చేశారు. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనురాగ్‌కు గురువారం పుట్టిన రోజు కూడా కావడం విశేషం. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కంగనా రనౌత్ వ్యవహారాల్లో రిపబ్లిక్ టీవీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కొందరిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి వాళ్ల ఇమేజ్‌ను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోందని అనురాగ్ లాంటి లిబరలిస్టులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలా నిరసనకు ప్రయత్నించారు.