బీజేపీలో తిరుగుబాటా ?

తెలంగాణా బీజేపీలో నేతలు తిరుగుబాటు చేస్తున్నారా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవునేని అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మల్కాజ్ గిరి పార్లమెంటు సీటు విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయంతో స్ధానిక నేతలు తీవ్రస్థాయిలో విభేదిస్తున్నారట. మల్కాజ్ గిరి పార్లమెంటులో ఈటల రాజేందర్ ను పోటీ చేయించాలని ఇప్పటికే అగ్రనేతలు డిసైడ్ చేశారు. పార్టీ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అయితే ఇదే సీటునుండి పోటీచేయటానికి చాలామంది నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మల్కాజ్ గిరికి నాన్ లోకల్ అయిన ఈటలను ఎలా పోటీ చేయిస్తారని లోకల్ నేతలు గట్టిగా నిలదీస్తున్నారు.

మల్కాజ్ గిరి నుండి పోటీ చేయడానికి కూన శ్రీశైలం గౌడ్, చాడ సురేష్ రెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి, మురళీధరరావు, మల్క కొమురయ్య ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో కొమురయ్య రాజకీయాలకు పూర్తిగా కొత్త. అయితే మిగిలిన నేతలు చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళే. వీరిలో కొందరు అనేక పార్టీలు తిరిగి ఇపుడు బీజేపీలో ఉన్నారు. మల్కాజ్ గిరిలో పోటీచేయటానికి ఇంతమంది లోకల్ నేతలుండగా నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని ఈటలను తీసుకొచ్చి పోటీచేయించాల్సిన అవసరం ఏమిటన్నది వీళ్ళ లాజిక్.

వీళ్ళ వ్యవహరం చూస్తుంటే అధిష్టానం ఈటలకు టికెట్ కన్ఫర్మ్ చేస్తే పార్టీపై తిరుగుబాటు చేసేట్లుగానే ఉన్నారు. ఇప్పటికే కూన తన మద్దతుదారులతో సమావేశాలు పెట్టుకుని భవిష్యత్ రాజకీయాలపై చర్చలు జరుపుతున్నారట. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీచేసిన ఈటల రెండుచోట్లా ఓడిపోవటమే పెద్ద మైనస్ అయ్యిందట. గజ్వేలులో కేసీయార్ కు వ్యతిరేకంగా పోటీచేసి ఓడిపోయిన ఈటల సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో కూడా ఓడిపోయారని ప్రత్యర్ధులు ఎత్తిచూపుతున్నారు.

రెండుచోట్లా ఓడిపోయిన ఈటలకు మళ్ళీ ఇపుడు మల్కాజ్ గిరి లాంటి సంబంధంలేని నియోజకవర్గంలో ఎంపీగా ఎలా పోటీచేయిస్తారంటు నిలదీస్తున్నారు. ఈటలకు టికెట్ వస్తే ప్రత్యర్ధులు ఇండిపెండెట్లుగా పోటీచేయకపోవచ్చు. అయితే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోనో లేకపోతే బీఆర్ఎస్ లోనో చేరిపోతారు. అప్పుడు ఈటలకు వ్యతిరేకంగా పోటీచేసి బీజేపీని ఓడగొట్టడం ఖాయమని అర్ధమవుతోంది. మొత్తానికి బీజేపీలో మల్కాజ్ గిరి చిచ్చు మామూలుగా ఉండేట్లులేదు. చివరకు ఏమవుతుందో చూడాలి.