టీడీపీ నేత, మైనారిటీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మెత్తబడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఆయనకు మిత్రపక్షం కారణంగా ఈ దఫా టికెట్ దక్కలేదు. అయితే.. ఇలా టికెట్ దక్కనివారిని వైసీపీ గాలికి వదిలేసినట్టుగా టీడీపీ వదిలేయలేదు. వారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరీ బుజ్జగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నారా లోకేష్ .. జలీల్ ఖాన్‌ను బుజ్జగించారు. ఆయన భవిష్యత్తును తనదిగా పేర్కొన్నారు.
అంతేకాదు.. పార్టీని గెలిపించాలని.. మైనారిటీలను ఏకం చేయాలని.. విజయవాడ పశ్చిమలో కలిసి మెలిసి పనిచేయాలని సూచించారు. ఇక, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ సీటును ఇవ్వడంతోపాటు.. మంత్రి పదవిని లేదా.. వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని ఐదేళ్లపాటు ఇస్తామని ఇది కూడా కుదరకపోతే.. మైనారిటీ సంక్షేమ కార్పొరేషన్‌కు చైర్మన్‌ను చేస్తామని నారా లోకేష్.. చంద్రబాబు మాటగా చెప్పినట్టు ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జలీల్ ఖాన్ తృప్తి పడ్డారు.
దీనికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనకు టికెట్ ఇవ్వకపోతే.. మైనారిటీలు ఉరేసుకుంటారని కొన్నాళ్లు జలీల్ బెట్టు చేశారు. తనకు ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు.త నకు ఎవరూ టికెట్ ఇవ్వకపోయినా పోటీ మాత్రం తప్పదని చెప్పారు. తనతో వైసీపీ కీలక నాయకులు.. భేటీ అయ్యారని.. పార్టీలోకి ఆహ్వానించారని వెల్లడించారు. పశ్చిమలో తనకు తప్ప ఎవరికీ పోటీ చేసే అర్హత, అవకాశం కూడా లేదని చెప్పుకొచ్చారు.
మొత్తానికి ఇలా వేడెక్కించిన జలీల్ ఖాన్.. అధినేత చంద్రబాబు సూచనలతో మెత్తబడడం గమనార్హం. దీంతో ఆయన అభిమానులు బీకాంలో ఫిజిక్స్ కు కెమిస్ట్రీ కుదిరిందని సంతో షాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక, జలీల్ ఖాన్ బలమైన నాయకుడు కావడం.. సుమారు 2.7 లక్షలు ఉన్న పశ్చిమ ఓట్లను ప్రభావితం చేయగల నాయకుడు కావడంతో ఇప్పుడు పశ్చిమలో మిత్రపక్షం గెలుపు నల్లేరుపై నడకేనన్నది పరిశీలకుల అంచనా.
Gulte Telugu Telugu Political and Movie News Updates