పెట్టుబడుల ఆశలన్నీ నత్వానీపైనే !

ఏపి నుండి అధికార పార్టీ రాజ్యసభ ఎంపిగా పరిమళ్ నత్వాని బుధవారం ప్రమాణ స్వీకారం చేశాడు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఛాంబర్లో సంబంధిత ఉన్నతాధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశాడు.

ఏపి నుండి నత్వానీతో పాటు రాజ్యసభకు ఎంపికైన ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈమధ్యనే రాజ్యసభలోనే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పట్లో వివిధ కారణాల వల్ల నత్వాని ప్రమాణ స్వీకారం చేయలేదు. దాంతో ఇపుడు ఉపరాష్ట్రపతి ఛాంబర్లో సింపుల్ గా ప్రమాణం చేసేశాడు.

నత్వాని మొదటిసారి 2008లో ఝార్ఛండ్ నుండి స్వతంత్ర అభ్యర్ధిగా మొదటిసారి రాజ్యసభకు ఎంపికయ్యాడు. తర్వాత రెండోసారి కూడా 2014లో ఇక్కడి నుండే ఇండిపెండెంట్ గానే ఎంపికయ్యాడు. అయితే మూడోసారి ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

దాంతో ఝార్ఖండ్ నుండి కుదరకపోవటంతో ఇతర రాష్ట్రాల వైపు దృష్టి పెట్టాడు. దాంతో ఏపి నుండి ఎంపికవ్వచ్చనే విషయం గ్రహించాడు. అసెంబ్లీలో ఎంఎల్ఏల సంఖ్యాబలం రీత్యా వైసిపికి నలుగురు సభ్యులు రాజ్యసభకు ఎంపిక అయ్యే అవకాశం ఉందని తెలియగానే నత్వానీ ఢిల్లీ స్ధాయిలో పావులు కదిపినట్లు ప్రచారం జరిగింది.

బిజెపిలో కీలక వ్యక్తుల ద్వారా జగన్మోహన్ రెడ్డి ని సంప్రదించి రాజ్యసభ సభ్యత్వాన్ని ఖాయం చేసుకున్నాడు. అయితే ఏపి నుండి ఎంపికవ్వాలని అనుకున్నా స్వతంత్ర సభ్యునిగానే ఎంపికవ్వాలని చేసిన ప్రయత్నాలు మాత్రం ఫెయిలయ్యాయి. స్వతంత్ర సభ్యునికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని జగన్ తెగేసి చెప్పటంతో వేరే దారిలేక వైసిపి నుండే ప్రాతినిధ్యం వహించటానికి నత్వాని అంగీకరించాల్సొచ్చింది.

ఇదే విషయమై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా అమరావతికి వచ్చి జగన్ తో భేటి అయిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. పార్టీ వెలుపల వ్యక్తికి వైసిపి తరపున రాజ్యసభకు ఎంపిక చేయటం నిజంగా నత్వానీతోనే మొదలు.

ఇటు రిలయన్స్ యాజమాన్యంతోను అటు కేంద్రంలోని కీలక వ్యక్తులతో నత్వానికి బాగా సన్నిహిత సంబంధాలున్నాయని ప్రచారం. నత్వానీ తన పరపతిని వాడి ఏపీకి పెట్టుబడులు తేవడంలో సహకరిస్తాడని వైసీసీ సర్కారు నమ్మకం పెట్టుకోవడం కూడా ఆయనకు సీటు దక్కడానికి ఒక కారణం. మరి నత్వాని ఏమి చేస్తాడో వేచి చూడాల్సిందే.