టీడీపీ-జనసేన టికెట్ల పంపకాల వ్యవహారం అగ్గిని రాజేస్తోంది. 175 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 118 స్థానాలతో కూడిన తొలి జాబితాను మాత్రమే టీడీపీ-జనసేనలు జారీ చేశాయి. వీటిలో టికెట్ దక్కని వారు ఒకవైపు నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు.. రోడ్డెక్కి నిరసనలు కూడా చేస్తున్నారు. అయితే.. మరో 57 నియోజక వర్గాలకు అసలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో దాదాపు అన్నీ కాంప్లికేటెడ్ నియోజకవర్గాలే కావడం గమనార్హం.
ముఖ్యంగా పెనమలూరు నియోజకవర్గం కాక రేపుతోంది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు.. మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయకుడు బోడే ప్రసాద్ ఉన్నారు. అయితే.. ఈ సీటు విషయంలో టీడీపీ తర్జన భర్జన పడుతోంది. మైలవరం నుంచి వచ్చే వైసీపీ నాయకుడిపై ఆశలు పెట్టుకున్న పార్టీ.. సీట్ల సర్దుబాటు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇదేసమయంలో సినీ రంగానికి చెందిన అగ్ర కధానాయకుడి కుటుంబానికి ఈ సీటు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పెనమలూరు వ్యవహారం.. రసకందాయంలో పడింది. ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారు? అనేది చర్చగా మారింది. పార్టీ కూడా దీనిపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టికెట్ తనకే వస్తుందని.. దీనిలో ఎలాంటి అనుమానాలు లేవన్నారు. నాలుగున్నరేళ్లుగా పార్టీ అభివృద్ధికి పనిచేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో టికెట్ తనకే వస్తుందన్న ధీమా ఉందన్నారు.
అయితే.. వేరేవారికి టికెట్ ఇస్తున్నారన్న వార్తలువస్తున్న నేపథ్యంలో బోడే స్పందిస్తూ.. ఇలాంటిది జరగదని చెప్పారు. ఎవరికీ తనను కాదని టికెట్ ఇవ్వబోరని అన్నారు. ఒకవేళ అదే జరిగితే.. తాను చేతులు ముడుచుకుని కూర్చోనని చెప్పుకొచ్చారు. అంటే.. తాను కూడా రెబల్ గా మారే అవకాశం ఉందన్న వాదనను ఆయన గట్టిగా ప్రకటించినట్టు అయింది. మరి ఈ విషయంలో టీడీపీ ఏం చేస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates