వైసీపీ జంపింగుల్లో ఒక్క‌రికే చోటు!

వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. టీడీపీలో చేరిన వారిలో కేవ‌లం ఒక్క‌రికి మాత్ర‌మే తాజాగా ప్ర‌క‌టించిన టీడీపీ జాబితాలో చోటు ద‌క్క‌డం గ‌మ‌నార్హం. వైసీపీ నుంచి గ‌త ఏడాది న‌లుగురు ఎమ్మెల్యేలు రెబ‌ల్స్‌గా మారి.. టీడీపీ చెంత‌కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగుకు పాల్ప‌డ్డార‌ని పేర్కొంటూ.. వైసీపీ వారిపై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. వీరిలో నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి, ఇదే జిల్లాకు చెందిన వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్నారు.

ఇక‌, గుంటూరు జిల్లా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి టీడీపీకి జైకొట్టారు. అయితే.. తాజాగా ప్ర‌క‌టించిన జాబితాలో వీరిలో కేవలం నెల్లూరు రూర‌ల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డికి మాత్ర‌మే చోటు ద‌క్కింది. ఆయ‌న‌ను అదే చోట‌నుంచి పోటీకి పెడుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది. మిగిలిన వారి పేర్లు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అయితే.. రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు .. మాత్రం అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు.

వీటిలో ఉండ‌వ‌ల్లి శ్రీదేవి ప్రాతినిధ్యంవ‌హిస్తున్న తాడికొండ నుంచి టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావ‌ణ్‌కుమార్‌కు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చారు. దీంతో శ్రీదేవికి టికెట్ లేకుండా పోయింది. పోనీ.. వేరే నియోజ‌క‌వ‌ర్గంలో అయినా.. చోటు క‌ల్పిస్తారా? అనుకుంటే.. గుంటూరు, కృష్ణాజిల్లాల్లోనిఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాలు నిండిపోయాయి. గుంటూరులోని వేమూరు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి న‌క్కా ఆనంద‌బాబుకు ఇచ్చారు. ఇక‌, ఇదే జిల్లాలోని ప్ర‌త్తిపాడును రామాంజ‌నేయులుకు కేటాయించారు. ఇక‌, కృష్ణాజిల్లాలోని పామ‌ర్రు, నందిగామ‌, తిరువూరు సీట్లు కూడా నిండిపోయాయి. దీంతో ఉండ‌వ‌ల్లికి మొండిచేయి మిగిలింది.

ఇక‌, ఉద‌య‌గిరి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా కాక‌ర్ల స‌తీష్‌ను ప్ర‌క‌టించారు. దీంతో ఇక్క‌డి వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే మేక‌పాటికి టికెట్ లేకుండా పోయింది. మ‌రి ఈయ‌న‌కు నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తారేమో చూడాలి. ఇదే స‌మ‌యంలో వెంక‌ట‌గిరి టికెట్‌నుఅస‌లు ప్ర‌క‌టించ‌లేదు. ఇక్క‌డ‌నుంచి మాజీ ఎమ్మెల్యే గొనుగుంట్ల రామ‌కృష్ణ పోటీకి సిద్ధంగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఈయ‌న ఓడిపోయారు. ఇక‌, ఇక్క‌డ నుంచి వైసీపీ నాయ‌కుడు ఆనం ఉన్నారు. ఈయ‌న కూడా తాజా జాబితాలో చోటు ద‌క్కించుకోలేక పోయారు.