రేవంత్ సర్కారు ఏర్పడి రోజులు గడుస్తున్నా.. కొన్ని అంశాల్లో దూకుడు ప్రదర్శించటం లేదన్న మాట తరచూ వినిపిస్తోంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉందన్న ప్రచారం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ వాదనకు బలం చేకూరేలా మరో ప్రచారం మొదలైంది. రియల్ ఎస్టేట్ కు ఊపు తెప్పించేలా హెచ్ఎండీఏ నిర్ణయాల్ని ప్రకటించటం లేదని.. చివరకు ప్రాజెక్టుల అనుమతుల విషయంలోనూ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్పించి హడావుడి నిర్ణయాలకు వెళ్లటం లేదు. ఈ తీరును కొందరు స్వాగతిస్తుంటే.. రియల్టర్లు మాత్రం తప్పు పడుతున్నారు.
డెవలప్ మెంట్ ప్రాజెక్టుల విషయంలో జోరును ప్రదర్శించాలని వారు కోరుతున్నారు. అయితే.. ఈ చర్చపై తాజాగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వ విధానాల్ని స్పష్టం చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాము అనాలోచిత నిర్ణయాలు తీసుకోమని.. తొందరపడి సంతకాలు పెట్టేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అడ్డగోలుగా సంతకాలు పెడితే శివబాలక్రిష్ణ మాదిరి జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న ఆయన.. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పైనా సెటైర్లు వేయటం గమనార్హం.
‘సొంత తెలివిని రుద్దితే మేడిగడ్డ లెక్కయితది. మేం అపరమేధావులం కాదు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోం. ఏ నిర్ణయంలోనైనా అనుభవజ్ఞుల సూచనలు తీసుకుంటాం. చంద్రబాబు.. వైఎస్సార్.. కేసీఆర్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. పాలనను అర్థం చేసుకోకుండా ఎక్కడపడితే అక్కడ సంతకాలు పెడితే హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలక్రిష్ణకు పట్టిన గతే పడుతుంది. గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలను క్రమపద్దతిలో పరిష్కరించుకుంటూ భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు.. ఫైళ్ల మీద సంతకాల విషయంలో తాను ఎంత కచ్ఛితంగా ఉన్నానన్న విషయాన్ని తాజా వ్యాఖ్యలతో చెప్పేశారని చెబుతున్నారు. అంతేకాదు.. ఏదైనా పనులు ఉంటే తనను కలవొద్దని.. పార్టీకి సంబంధించిన పనుల మీద మాత్రం తనను కలవొచ్చన్న రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.