సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు ఏపీ సామాజిక న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్న జూపూడి ప్రభాకర్. తాజాగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని తిప్పి కొట్టే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశంపై ఆయన ఎంతో క్లారిటీగా సమాధానం ఇచ్చారు. అంబేడ్కర్ విదేశీ విద్య పేరును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చటాన్ని జూపూడి సమర్థించారు.
అంబేడ్కర్ పేరును తొలగించి జగన్ తన పేరు పెట్టుకున్నా తమకు ఆనందమేనన్న ఆయన.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్ పేరుతో విదేశీ విద్యకు ఒక్కో విద్యార్థికి రూ.15 లక్షలు ఇచ్చేవారన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రూ.50 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు ఇస్తోందన్నారు.
‘గతంలో కంటే డబ్బులు పెంచినందున అంబేడ్కర్ పేరును తీసేసినా తప్పు కాదు. జగన్ పేరు పెట్టుకున్నా.. ఆయన తన తండ్రి వైఎస్సార్ పేరు పెట్టుకున్నా తప్పు కాదు. మాకు డబ్బులే ముఖ్యం. అంబేడ్కర్ పేరు కాదు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకూ జూపూడి ఈ వ్యాఖ్యలు ఎప్పుడు? ఎక్కడ? ఏ సందర్భంలో చేశారన్నది చూస్తే.. శనివారం క్రిష్ణా జిల్లా మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్ విదేశీ విద్య పథకం పేరును ప్రభుత్వం మారుస్తూ నిర్ణయం తీసుకోవటంపై స్పందన అడగ్గా.. ఆయనీ రీతిలో రియాక్టు అయ్యారు.