ప్రభుత్వానికి ‘కాగ్’ ఆయుధమిచ్చిందా ?

కేసీయార్ పాలనలో వివాదాస్పదమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ దుమ్ము దులిపేసినట్లుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పటి కేసీయార్ ప్రభుత్వం చేసిన ఖర్చులో సగం వేస్టయిపోయిందని కాగ్ స్పష్టంగా చెప్పింది. ఖర్చుచేసిన ప్రతి రూపాయిలో 48 పైసలు వృధాయినట్లు కాగ్ తేల్చింది. ప్రభుత్వంపైన కాళేశ్వరం ప్రాజెక్టు తెల్లఏనుగులాగ తయారవ్వటం ఖాయమని అభిప్రాయపడింది. ప్రాజెక్టు నుండి వచ్చే ఆదాయం ఏమీలేకపోయినా ఖర్చును మాత్రం అప్పటి ప్రభుత్వం విపరీతంగా చేయటాన్ని కాగ్ తప్పుపట్టింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చుచేసిన నిధుల్లో 72 శాతం అప్పుల ద్వారానే సేకరించటాన్ని కాగ్ తప్పుపట్టింది. ప్రభుత్వం ఆదాయం ఆధారంగా మాత్రమే ప్రాజెక్టుల నిర్మాణాలకు రూపకల్పన చేయాలని చెప్పింది. నిధుల వ్యయంలో ప్రభుత్వ వాటా ఎక్కువగాను అప్పులు తక్కువగా ఉన్నపుడే ప్రభుత్వం అప్పుల్లో నుండి తొందరగా బయటపడుతుందని కాగ్ తేల్చిచెప్పింది. ప్రాజెక్టు కోసం తయారైన డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) లెక్కలకు కూడా పొంతన కుదరటంలేదని ఆక్షేపించింది. సమగ్రమైన డిజైన్ రెడీ కాకుండానే కేసీయార్ ప్రాజెక్టును హడావుడిగా మొదలుపెట్టిందని కాగ్ అభిప్రాయపడింది.

పరిపాలనా అనుమతులు కూడా తీసుకోకుండానే ప్రాజెక్టును మొదలుపెట్టడాన్ని తప్పుపట్టింది. రివైజ్డు డీపీఆర్ కు కూడా అనుమతులు తీసుకోలేదని కాగ్ కుండబద్దలు కొట్టి చెప్పింది. ప్రాజెక్టు విషయంలో కేంద్రానికి ఇవ్వాల్సిన పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వలేదన్న విషయాన్ని కాగ్ బయటపెట్టింది. కాగ్ రిపోర్టును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇంతకాలం రేవంత్ రెడ్డి, మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీయార్ తప్పుపడుతున్న విషయాన్నే కాగ్ సమర్ధిస్తున్నట్లుంది

దీనిపైన చర్చల రూపంలో అసెంబ్లీలో రెండుపార్టీల మధ్య మంటలు పుట్టడం ఖాయమనే అనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టునిర్మాణం, జరిగిన అవినీతిపై రేవంత్ అండ్ కో పదేపదే కేసీయార్ ను తప్పుపడుతున్నారు. దీనికి కౌంటరుగా కేసీయార్, హరీష్ రావు ఎదురుదాడి చేస్తున్నారు. తమను తాము సమర్ధించుకుంటు నోటికొచ్చినట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ తన ఫైండింగ్స్ ను రిపోర్టు రూపంలో బయటపెట్టింది. ఈ రిపోర్టునే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయుధంగా వాడుకోబోతోందన్న విషయం అర్ధమవుతోంది. మరి చర్చల్లో ఏమి జరుగుతుందో చూడాలి.