బొత్స వారి రాయ‌బారం.. వ‌ర్క‌వుట్ కాని వైసీపీ!

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ.. వైసీపీలో టికెట్ల పందేరం పెద్ద వివాదాన్నే రేపుతోంది. టికెట్లు ద‌క్కిన వారు కూడా.. త‌మ‌కు ఇచ్చిన స్థానాల‌ను చూసుకుని నిరాశ‌గా ఉన్నారు. ఇక‌, టికెట్లు ద‌క్క‌ని వారు ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే బాధ్య‌త‌ల‌ను వైసీపీ సీనియ‌ర్ మంత్రి, ఇదే జిల్లాకు చెందిన షార్ప్ షూట‌ర్ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు అప్ప‌గించింది. అయితే.. ఆయన చేస్తున్న రాయ‌బారం ఎక్క‌డా వ‌ర్కవుట్ కావ‌డం లేదు. దీంతో ఏ క్ష‌ణాన ఈ జిల్లా నుంచి ఎవ‌రు జంప్ చేస్తారో అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగిందంటే..

విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కొన్నాళ్లుగా తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌ పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్, గాడు అప్పారావు తమ కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు. త‌మ‌కు అన్యాయంచేస్తున్నార‌ని.. కోల‌గ‌ట్ల ఒంటెత్తు పోక‌డ‌ల‌తో తాము ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలోనే అనేక సార్లు పార్టీకి చెప్పినా అధిష్టానం రెస్సాండ్ కాలేదు.

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఆయా నేతలు పార్టీకి రాజీనామా లేఖలు పంపారు. దీంతో ఎన్నిక‌ల‌కు ముందు త‌లెత్తిన ముస‌లాన్ని స‌రిచేయాల‌ని.. వైసీపీ అధిష్టానం మంత్రి బొత్స సత్యనారాయణకు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అయితే.. ఆయ‌న రంగంలోకి దిగి నాయ‌కుల‌ను ఎంత బుజ్జగించినా వారు స‌సేమిరా అంటున్నారు. అంతేకాదు.. త‌మ‌కు పార్టీలో క‌నీస గౌర‌వం కానీ, మ‌ర్యాద కానీ, లేద‌ని బొత్స‌తోనే వ్యాఖ్యానించారు.

ఇంత వరకు కోల‌గ‌ట్ల‌ దౌర్జన్యాలు, అక్రమాలు భరించామని, ఇక తమ వల్లకాదని నేతలు తేల్చి చెప్పారు. విజయనగరంలో వైసీపీ పతనమైపోతోందని పార్టీ రాష్ట్ర నాయకులకు చెప్పినా ఫలితం లేదన్నారు. ఈ నెల 19వ తేదీన 10 వేల మందితో టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో తెలుగుదేశంలో చేరుతున్నామని పిల్లా విజయకుమార్, అవనాపు విజయ్ ప్రకటించడం గ‌మ‌నార్హం. దీంతో మంత్రి బొత్స వారిని మ‌రోసారి బుజ్జ‌గించేందుకు విందు ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌రి ఇదైనా ఫ‌లిస్తుందో లేదో చూడాలి.