జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వైసీపీ ప్రభుత్వం నుంచి భారీ షాక్ తగిలింది. ఆయన పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో తాజాగా భీమవరానికి చేరుకోవాల్సిన ఆయన పర్యటనను వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి ఏపీలో పర్యటనలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఎన్నికలకు ముందు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. పార్టీని బలోపేతం చేయాలని అనుకున్నారు. కానీ, ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. భీమవరం పర్యటన విషయంలో ఆర్ అండ్ బి శాఖ మోకాలడ్డింది. ఈ కారణంతో బుధవారం చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది.
భీమవరంలోని విష్ణు కాలేజీ ప్రాంగణంలోని హెలీప్యాడ్ లో పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలీకాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమ తులు కోరారు. అయితే.. అధికారులు హెలీప్యాడ్ ఏర్పాటు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరపెట్టడం వెనక అధికార పక్షం ఒత్తిళ్ళు ఉన్నట్లు అర్థమవుతోందని జనసేన విమర్శించింది. విష్ణు కాలేజీలో ఉన్న హెలీప్యాడ్ ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉన్నాయని నాయకులు విమర్శించారు.
ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్ అండ్ బి అధికారులతో అనుమతుల విషయంలో మెలికలుపెట్టిస్తున్నారని నాయకులు మండిపడ్డారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోవడాన్ని ఖండిస్తున్నామని జనసేన నాయకులు తెలిపారు. కాగా, గతంలోనూ చంద్రబాబును జైలుకు తరలించినప్పుడు.. పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్‌ను రోడ్డు మార్గంలో వచ్చేందుకు కూడా ప్రభుత్వం అనుమతించలేదు. అప్పట్లోనూ తన పర్యటనను వాయిదా వేసుకున్న పవన్.. చాలా రోజుల తర్వాత.. రాజమండ్రికి వచ్చి చంద్రబాబును పరామర్శించారు. ఇక, ఇప్పుడు ఎన్నికలకు ముందు భీమవరంలో నిర్వహించ తలపెట్టిన సభను కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం పట్ల.. జనసేన నాయకులు మండిపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates