మొత్తానికి సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ పెద్ద ప్రమాదంలోనే పడ్డారు. అవినీతి ఆరోపణలపై ఏసీబీ ఉన్నతాధికారులు అరవింద్ కు నోటీసులు జారీచేశారు. నోటీసులు అందిన రెండురోజుల్లోగా తమ ముందు విచారణ హాజరుకావాలని అందులో స్పష్టంగా చెప్పారు. హెచ్ఎండీఏ డైరెక్టర్ గా పనిచేసిన శివబాలకృష్ణను ఏసీబీ అరెస్టుచేసిన విషయం తెలిసిందే. డైరెక్టర్ హోదాలో రియల్ ఎస్టేట్ సంస్ధలకు అనుమతులు ఇవ్వటానికి శివ కోట్లాది రూపాయలు సంపాదించాడని ఇప్పటికే బయటపడింది. ఇప్పటివరకు బయటపడిన డైరెక్టర్ ఆస్తుల విలువ సుమారు రు. వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా.
తనిష్ట ప్రకారం కొన్నిసార్లు అవినీతికి పాల్పడితే మరికొన్నిసార్లు ఐఏఎస్ అధికారుల ఒత్తిడి ప్రకారం పనిచేశారని తానే అంగీకరించాడు. తనపైన ఒత్తిడి పెట్టిన వాళ్ళల్లో అరవింద్ కూడా ఉన్నట్లు డైరెక్టర్ ఇచ్చిన వాగ్మూలంతోనే ఈ ఐఏఎస్ ను గట్టిగా తగులుకున్నారు. వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీల నుండి అరవింద్ ఎంతెంత డబ్బులు తీసుకున్నారనే విషయాన్ని డైరెక్టర్ తన వాగ్మూలంలో చెప్పేశారు. అప్పటికే ఫార్ములా ఈ రేసింగు కుంభకోణంలో అరవింద్ నిండా మునిగిపోయున్నారు.
అలాంటి అరవింద్ పై తాజాగా హెఛ్ఎండీఏ అనుమతుల అవినీతి, అక్రమాల కేసు కూడా చుట్టుకున్నది. ఇదికాకుండా ఎలాంటి టెండర్లు లేకుండానే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పనులు అప్పగించారనే ఆరోపణలు ఎప్పటినుండో ఉన్నాయి. దీనిపైన కూడా విచారణ చేయించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇక్కడ విషయం ఏమిటంటే అరవింద్ తో పాటు ఇంకా ఎంతమంది డైరెక్టర్ అవినీతిలో భాగస్తులున్నారో చూడాలి. అందుకనే ముందు అరవింద్ విచారణను ఏసీబీ మొదలుపెడుతోంది.
తనపైన ఒత్తిళ్ళు తెచ్చి వెంచర్లకు అనుమతులు ఇచ్చేట్లు చేసిన ఐఏఎస్ అధికారుల పేర్లను ఇప్పటికే బాలకృష్ణ పూసగుచ్చినట్లు చెప్పేశారు. పేర్లు చెప్పటమే కాకుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎంతెంత మొత్తాలను తీసుకున్నది, ఏ రూపంలో తీసుకున్నారన్న విషయాలను కూడా బాలకృష్ణ చెప్పేశారని సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధంలేకుండానే చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ 26 ఎకరాలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ 58 ఎకరాల బాగోతం బయటపడింది. వీళ్ళని విచారించేందుకు కూడా ఏసీబీ రెడీ అవుతోంది. ఇంకెంతమంది ఐఏఎస్ లు బాగోతాలు బయటపడతాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates