మ‌రో వికెట్ ఢ‌మాల్‌.. సైకిలెక్క‌నున్న‌ కందుకూరు ఎమ్మెల్యే

వైసీపీకి మ‌రో షాక్ త‌గ‌లనుంది. ఆ పార్ట కీల‌క నాయ‌కుడు, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ నాయ‌కుడిగా ఉన్న మ‌హీధర్ ‌రెడ్డి.. అనేక ప‌ర్యాయాలు కందుకూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. పాత‌త‌రం నాయ‌కుల్లో ఆయ‌న ఒక‌రు. గ‌తంలో మ‌ర్రి హ‌యాంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలోని రెడ్డి సామాజిక వ‌ర్గం నాయ‌కుల్లో వివాద ర‌హిత నాయ‌కుడిగా మానుగుంట‌కు మంచి పేరుంది.

కందుకూరు నుంచి 1989, 2004, 2009, 2019లో విజ‌యాలు ద‌క్కించుకున్న మ‌హీధ‌ర్‌రెడ్డి జ‌గ‌న్ హ‌యాంలో ఆయ‌న వెంటే న‌డిచారు. మంత్రి ప‌ద‌విని ఆశించారు. అయితే.. మంత్రి ప‌దవి ద‌క్క‌లేదు. అయిన‌ప్ప‌టి కీ.. సీఎం జ‌గ‌న్ పై అభిమానంతో ఆయ‌న పార్టీలోనే ఉన్నారు. ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డంలో ఆయ‌న స్ట‌యిల్ వేరు! అనే మాట తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న కు టికెట్ లేద‌నే సంకేతాలు వెళ్లాయి. కొన్నాళ్లు ఆయ‌న సీఎం జ‌గ‌న్‌ను క‌లుసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఫ‌లితం ద‌క్క‌లేదు.

దీంతో హ‌ర్ట్ అయిన మానుగుంట‌.. పార్టీ మార్పున‌కు శ్రీకారం చుట్టారు. వైఎస్‌కు వీర విధేయుడిగా గుర్తింపు పొందిన మానుగుంట‌.. కొన్నాళ్ల కింద‌ట‌.. జ‌గ‌న్ ఎలంటి నిర్ణ‌యం తీసుకుంటాన‌న్నా ఓకే చెబుతాన‌ని అన్నారు. అయితే.. త‌న ప్ర‌త్య‌ర్థికి టికెట్ ఇస్తున్న‌ట్టు తెలియ‌డంతో ఆయ‌న త‌న దారి తాను చూసుకుం టున్నారని తెలుస్తోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు సూచ‌ల‌న మేర‌కు.. ఆ పార్టీ యువ నాయ‌కు డు నారా లోకేష్‌తో మానుగుంట భేటీ అయ్యార‌ని స‌మాచారం.

నారా లోకేష్ తో భేటీ అనంత‌రం.. త‌న అభిప్రాయాన్ని మీడియాకు చెప్పే అవ‌కాశం ఉంది. ఏదేమైనా.. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ చేజేతులా ఇలాంటి వారిని దూరం చేసుకోవ‌డం.. ఇబ్బందేన‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.