ప్రస్తుతం ‘నిజం గెలవాలి’ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి.. నారా భువనేశ్వరి పార్టీ నేతలతోనూ మమేకమవుతున్నారు. పార్టీ గురించి వారికి దిశానిర్దేశం చేస్తున్నా రు. తాజాగా గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కీలకమైన పథకంగా గత చంద్రబాబు హయాంలో పేర్కొన్న అన్నా క్యాంటీన్‌ను ఇక్కడ ప్రారంభించారు.
మంగళగిరి నియోజకవర్గం పరిదిలోని రేవేంద్రపాడు మండలంలో భువనేశ్వరి ఈ క్యాంటీన్‌ను ప్రారంభించి.. పేదలకు అన్నం వడ్డించారు. కేవలం రూ.5 కే భోజనం, ఉదయం పూట టిఫిన్ అందించాలన్న సంకల్పంతో చంద్రబాబు హయాంలో అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టారు. వీటిని బాగానే ముందుకు తీసుకువెళ్లారు. దినసరి కూలీలు, పేదలు, రోజు వారీ పనులు చేసుకునే కార్మికులు, ఆటో , రిక్షా కార్మికులు ఈ క్యాంటిన్లను వినియోగించుకునేవారు.
అదేవిధంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా వీటిని ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు సైతం అన్న క్యాంటన్లలో భోజనం , టిఫిన్ చేసేవారు. అయితే.. ప్రభుత్వం మారి .. వైసీపీ అధికారంలోకి వచ్చాక… అన్నా క్యాంటీన్లకు గ్రహణం పట్టుకుంది. వాటిని మూసివేశారు. కొన్ని ప్రాంతల్లో అన్నా క్యాంటీన్లను సచివాలయాలుగా మార్చేశారు. మరికొన్ని చోట్ల మునిసిపాలిటీ మరుగు దొడ్లుగా మార్చారు. ఇలా.. అన్నా క్యాంటీన్ల రూపు రేఖలు మారిపోయాయి.
అయితే.. ప్రజల్లో మాత్రం వీటి గురించి చర్చ మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో దీనిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలావుంటే.. పలువురు కీలక నాయకులు, చింతమనేని ప్రభాకర్, పయ్యావుల కేశవ్, బోడే ప్రసాద్, కేశినేని చిన్ని వంటివారు.. తమ తమ నియోజకవర్గాల్లో వీటిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇక, మంగళగిరిలోనూ.. నారా లోకేష్ మూడు ప్రాంతాల్లో వీటిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసింది .. 4వ క్యాంటీన్ కావడం గమనార్హం.