నెల్లూరు సిటీ నియోజకవర్గం టికెట్‌ను మాజీ మంత్రి, కాపు నాయకుడు, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణకు ఇస్తున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఇప్పటికే ఆయన నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తాజాగా జరిగిన చర్చల్లో చంద్రబాబు నారాయణకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలన్న సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నికలకు ముందే పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. ఆయన సతీమణి రమాదేవి ఇప్పటికే రంగంలోకి దిగారు.
గత ఎన్నికల్లో నారాయణ పోటీ చేసిన స్థానాన్ని ఈ దఫా కూడా ఆయనకే ఇవ్వనున్న నేపథ్యంలో, అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నారు నారాయణ. దీంతో వెనువెంటనే ఆయన ఆదివారం రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి తొలిసారి పోటీ చేసిన మాజీ మంత్రి(అప్పట్లో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు).. స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే.. ఈ దఫా మాత్రం ఓటమి నుంచి గెలుపు కోసం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
2019 ఎన్నికల్లో పొంగూరు నారాయణకు 71 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి ఇక, ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్‌కు 74 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. అంటే.. ఇద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం 3 వేలు మాత్రమే. అది కూడా.. ఇక్కడ ముక్కోణపు పోటీ జరిగింది. అప్పట్లో జనసేన తరపున కేతంరెడ్డి వినోద్ పోటీ చేశారు. ఈయనకు 8 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఇక, ఇప్పుడు జనసేన-టీడీపీ మిత్రపక్షంగా ఉండడంతో ఓట్లు చీలే అవకాశం లేదు.
మరోవైపు.. తనకు ప్రతికూలంగా ఉన్న మండలాలపై నారాయణ దృష్టి పెట్టారు. ఈ మండలాల్లో టీడీపీ సానుభూతిపరులు, కేడర్‌తో ఆయన టచ్‌లో ఉన్నారు. పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం వివరిస్తున్నారు. ఇక, ఆయన సతీమణి.. రమాదేవి.. ఎన్నికలకు ఇప్పటికే.. ఇంటింటి ప్రచారంచేస్తున్నారు. మహిళలకు బొట్టు పెట్టి మరీ.. తన భర్తను గెలిపించాలని కోరుతున్నారు. ఇది వర్కవుట్ అవుతుందని పార్టీ అంచనా వేస్తోంది. వీటికితోడు పొత్తు కూడా కలిసి వచ్చి.. ఈ నియోజకవర్గంలో నారాయణ గెలుపు తథ్యమని భావిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా ఎన్నిలకు ముందే టికెట్ కన్ఫర్మ్ కావడం నారాయణలో సంతోషాన్ని నింపింది.