తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కీలక నాయకుడు కేటీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత ఏపీ వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్ షాక్ ఇచ్చారు. ఆయనకు పరువు నష్టం నోటీసులు పంపించారు. “కేటీఆర్ తన ఫామ్ హౌస్‌లో ఉల్లాసంగా గడుపుతూ ఉండొచ్చు. కానీ 7 రోజుల్లో నోటీసుపై స్పందించాలి” అని మాణిక్యం వ్యాఖ్యానించారు. ఏడు రోజుల్లో స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని తెలిపారు.
అసలు ఏంటీ వివాదం..
ఇటీవల సిరిసిల్లలో పర్యటించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ మాణిక్యం ఠాకూర్‌ను కార్నర్ చేస్తూ.. విమర్శలు గుప్పించారు. పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డి రూ.50 కోట్లకు కొనుగోలు చేశాడని.. ఆ డబ్బులను మాణిక్యం ఠాకూర్‌కు ఇచ్చారని ఆరోపించారు. కేవలం కేటీఆరే కాకుండా.. పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురునాయకులు ఇవే వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌పైనే మాణిక్యం ఠాకూర్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కేటీఆర్ రివర్స్ కామెంట్స్..
మాణిక్యం ఠాకూర్ నోటీసులపై మాజీ మంత్రికేటీఆర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. “అవి నేను అన్న మాటలు కాదు. కాంగ్రెస్ నేత, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో అన్న మాటలే” అని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం కోట్ చేశానని గుర్తు చేశారు. దీనికి సంంధించి ఓ దినపత్రిక కటింగ్ ను కేటీఆర్ పోస్టు చేశారు. “మీడియాలో వైరల్ అయిన రూ. 50 కోట్ల లంచం వార్తలనే నేను ప్రస్తావించా. కోమటిరెడ్డి మీపై చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదు” అని కేటీఆర్ అన్నారు. అంతేకాదు.. పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.