రాబోయే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల టికెట్లను జగన్మోహన్ రెడ్డి దాదాపు ఖాయంచేసేశారు. అయితే ఎంతకాలం కసరత్తు చేసినా ఒక నియోజకవర్గం మాత్రం కొరుకుడుపడట్లేదు. ఆ నియోజకవర్గమే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం. ప్రకాశం జిల్లాలో మొదటినుండి ఒంగోలు ఎంఎల్ఏ బాలినేని శ్రీనివాసులరెడ్డి హవా బాగానే నడుస్తోంది. ఈయన జగన్ కు దగ్గరి బంధువు కూడా కావటంతో జిల్లాలో దాదాపు తిరుగులేకుండా ఉంది. ఇలాంటి నేపధ్యంలో జగన్ టికెట్లకు అభ్యర్ధులను ఫైనల్ చేస్తున్నారు.
జిల్లాలో చాలాసీట్లను ఫైనల్ చేసినా ఒంగోలు పార్లమెంటు సీటును మాత్రం చేయలేకపోతున్నారు. కారణం ఏమిటంటే బాలినేనే అని చెప్పాలి. విషయం ఏమిటంటే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికే టికెట్ కేటాయించాలని బాలినేని పట్టుబట్టారు. మాగుంటకు టికెట్ ఇవ్వకూడదని జగన్ డిసైడ్ అయ్యారు. అందుకనే ప్రత్యామ్నాయంగా ఎవరిపేరును ప్రతిపాదిస్తున్న బాలినేని రెజెక్టు చేస్తున్నారు. ఇదే సమయంలో మాగుంటకు టికెట్ కోసం బాలినేని ఎంత పట్టుబడుతున్నా జగన్ నో అంటున్నారు. ఒంగోలు ఎంపీ టికెట్ మీదే ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఆధారపడుంది.
మాగుంటకు ఎంపీగా టికెట్ ఇస్తేనే తాను ఒంగోలు అసెంబ్లీ నుండి పోటీచేస్తానని బాలినేని షరతు పెట్టారట. మాగుంటకు జగన్ టికెట్ ఇవ్వకపోతే బాలినేని కూడా పోటీ చేయరన్నది స్పష్టమైంది. ఒంగోలు ఎంపీ, ఎంఎల్ఏ టికెట్ల మీదే మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు ఆధారపడుంది. దాంతో ఏమిచేయాలో అర్ధంకాక జగన్, బాలినేని ఇద్దరు సతమతమవుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్లను ఫైనల్ చేయగలుగుతున్న జగన్ ఒంగోలు ఎంపీ టికెట్ ను మాత్రం ఫైనల్ చేయలేక అవస్తలు పడుతున్నారు.
మాగుంట, బాలినేని ఇద్దరికీ టికెట్లు ఇవ్వకపోతే పార్టీకి జరగబోయే డ్యామేజి గురించి జగన్ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి బాలినేని వ్యవహారశైలితో జగన్ తో పాటు చాలామంది నేతలు బాగా విసిగిపోయున్నారు. అయితే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో బాలినేనికి ఉన్న పట్టు, దగ్గరి బంధువన్న కారణాలతోనే బాలినేని ఎంత కంపుచేసినా జగన్ భరిస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates