ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలపై జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంకా మక్కువ పోలేదని తెలుస్తోంది. గత 2024 పార్లమెంటు ఎన్నికల సమయంలో ఆయన అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు దాదాపు నాలుగు మాసాల ముందు నుంచి కూడా నియోజకవర్గంలో పర్యటించారు. సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేశారు. అదే సమయంలో వైసీపీ నాయకులపై ఆయన విమర్శలు కూడా గుప్పించారు. మొత్తంగా అనకాపల్లి నియోజకవర్గం నుంచి గెలుపు ఖాయమని మానసికంగా కూడా ఆయన నిర్ధారించుకున్నారు.
ముఖ్యంగా కాపు సామాజిక వర్గం మొత్తం తనను కచ్చితంగా గెలిపిస్తుంది అన్న భావంలో కూడా అప్పట్లో ఉన్నారు. అయితే అనూహ్యంగా బిజెపితో పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఈ సీటును వదులుకోవాల్సి వచ్చింది. దీంతో బిజెపి తరఫున సీఎం రమేష్ అనకాపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ విజయం వెనకాల కూడా జనసేన పార్టీ ఉందన్నది ఆ పార్టీ నాయకులు తరచుగా చెప్పే మాట. ఇదిలా ఉంటే అనకాపల్లి నియోజకవర్గ నుంచి పోటీ చేయలేకపోయాను అన్న ఆవేదన, బాధ నాగబాబులో తరచుగా కనిపిస్తోంది.
కొన్నాళ్ల కిందట విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి మనదేనని కానీ పొత్తులో భాగంగా దానిని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు అనకాపల్లిలో కచ్చితంగా తన పోటీ చేసి ఉంటే గ్యారెంటీగా భారీ మెజారిటీ వచ్చేదని కూడా జనసేన నాయకులతో చెప్పడం అప్పట్లో ఆసక్తిగా మారింది. తాజాగా శ్రీకాకుళంలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సదస్సులో కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని మనం వదులుకోవాల్సి వచ్చిందని, పొత్తు ధర్మానికి కట్టుబడాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
అంతేకాదు అనకాపల్లి నియోజకవర్గంలో మనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని, అందరూ కలిసి నియోజకవర్గాన్ని నిలబెట్టాలని కూడా ఆయన సూచించడం గమనార్హం. ఆయన ఉద్దేశం ఏంటి అనేది పక్కన పెడితే అనకాపల్లి నియోజకవర్గంలో మాత్రం నాగబాబుకి ఇంకా మక్కువ పోలేదన్న విషయం స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు బిజెపి కోసం మొత్తంగా రెండుసార్లు త్యాగం చేయాల్సి వచ్చింది. ఒకటి అనకాపల్లి నియోజకవర్గం అయితే రెండు రాజ్యసభ స్థానాన్ని కూడా ఆయన బిజెపి కోసం వదులుకున్నారు.
గత ఏడాది రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు చివరి నిమిషం వరకు కూడా నాగబాబు కచ్చితంగా రాజ్యసభకు వెళ్తారు అని అనుకున్నారు. కానీ మధ్యలో బిజెపి ఎంటర్ కావటంతో ఆ సీటు తమకే కావాలని పట్టుబట్టడంతో నాగబాబు తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ మనసు మాత్రం పార్లమెంటుపై తరచుగా లాగుతుందని చెప్పడానికి ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలే ఉదాహరణగా మారుతున్నాయి. మరి ఆయన కోరిక తీరుతుందా లేదా అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates