ఎన్నారై య‌శ‌స్వికి ఊర‌ట‌.. అమెరికా వెళ్లేందుకు ఓకే!

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టార‌ని ఆరోపిస్తూ.. ఏపీ సీఐడీ పోలీసులు టీడీపీ ఎన్నారై(ప్ర‌వాసాంధ్ర‌) విభాగం కార్య‌క‌ర్త‌.. య‌శ‌స్వి బొద్దులూరి, ఉర‌ఫ్ య‌శ్‌పై కేసులు న‌మోదు చేయ‌డం తెలిసిందే. ఆయ‌న త‌న త‌ల్లిని ప‌రామ‌ర్శించేందుకు గ‌త నెల ప్రారంభంలో హైద‌రాబాద్‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో విమానాశ్ర‌యంలోనే అరెస్టు చేశారు. అయితే.. ఇది చ‌ట్ట విరుద్ధం కావ‌డంతో ఆయ‌న‌కు 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఈ క్ర‌మంలోనే య‌శ‌స్విపై లుకౌట్ స‌ర్క్యుల‌ర్‌ను జారీ చేశారు.

అంటే.. య‌శ‌స్వి విదేశాల‌కు వెళ్ల‌కుండా నిరోధించే ప్ర‌య‌త్నం. అయితే.. ఇప్ప‌టికే 41ఏ నోటీసులు ఇచ్చిన ద‌రిమిలా.. ఇంకా లుకౌట్ నోటీసులు కొన‌సాగించ‌డం ఏంట‌నేది య‌శ్ ప్ర‌శ్న‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఈ లుకౌట్ నోటీసుల‌పై హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ చేసిన న్యాయ‌మూర్తి.. య‌శ్‌కు అనుకూలంగా తీర్పు చెప్పారు. సీఐడీ జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ ను రద్దు చేశారు. ఇప్పటికే యశ్ కు 41ఏ నోటీసులు ఇచ్చారని, ఈ కేసులో ఇంకా చార్జిషీట్ వేయలేదని ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు వివరించారు.

చార్జిషీట్ వేయకుండానే లుకౌట్ సర్క్యులర్ కొనసాగించడం ఆర్టికల్ 21(జీవించే హ‌క్కు, స్వేచ్ఛ‌)కి విరుద్ధమని న్యాయవాది ఉమేశ్ చంద్ర స్పష్టం చేశారు. అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చాక లుకౌట్ సర్క్యులర్ కొనసాగించడం అర్థరహితమని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం ఫిబ్రవరి 4న యశ్ అమెరికా వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఏపీ సీఐడీ జారీ చేసిన‌ సర్క్యులర్ ను రద్దు చేస్తున్నట్టు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.