వైసీపీ ఎమ్మెల్యే.. ఫైర్‌బ్రాండ్ నాయకుడు చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డికి స్థానికుల నుంచి సెగ తగిలింది. నిజానికి ఆయనంటే.. నియోజకవర్గంలో పెద్దగా వ్యతిరేకత లేదు. అందరిలోనూ కలివిడిగా ఉంటారు. ఆర్భాటాలు, అట్టహాసాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా కలిసిపోతారు. కష్టాలు, సుఖాల్లో నేనున్నానంటూ.. ముందుకు వస్తారు. దీంతో చెవిరెడ్డి సామాన్యుల్లో ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొన్ని కొన్ని పనులు పెద్ద సెగనే పెడుతున్నాయి. ప్రస్తుతం చంద్రగిరి టికెట్‌ను సీఎం జగన్ చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి ఇచ్చారు.
ఆయన ఇంకా ప్రచారంలోకి దిగలేదు. పైగా నోటిఫికేషనే రాలేదు. అయితే.. ప్రజలను మాత్రం కలుస్తున్నారు. ఇది తప్పు కాదు. అయితే.. షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ.. అధికారులపై పెత్తనం చేయడం.. కీలకమైన కార్యాలయాల్లో సీఎం జగన్ ఫొటో పక్కన మోహిత్ రెడ్డి ఫొటోను పెట్టడం.. అధికారులు కూడా ఆయన మాటలకే ప్రాధాన్యం ఇవ్వడం వంటివి వివాదంగా మారుతున్నాయి. గత రెండేళ్ల నుంచి కూడా మోహిత్‌కే టికెట్ అని చెవిరెడ్డి ప్రచారం చేస్తున్నారు. తాను తప్పుకొంటానని చెబుతున్నారు. దీంతో మోహిత్ రెడ్డి దూకుడు సహజంగానే పెరిగింది. కానీ, ఇంతగా ప్రభుత్వ కార్యాలయాల్లో.. ఆయన ఫొటోలు పెట్టే రేంజ్‌లో పెరుగుతుందని స్థానికులు ఊహించలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా కొందరు మహిళలు, స్థానికులతో కలిసి.. సదరు ప్రభుత్వ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఏ అధికారం ఉందని మోహిత్ రెడ్డి ఫొటో ఆఫీసులో పెట్టారని వారు ప్రశ్నించారు. ప్రతి విషయానికీ ఆయనను కలవాలని చెప్పడం ఏంటని నిలదీశారు. దీనిపై సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సదరు మహిళలకు సర్ది చెప్పేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ, వారు శాంతించక పోవడంతో ఎమ్మెల్యే కార్యాలయం వరకు సమాచారం చేసింది. తర్వాత ఏం జరగిందో తెలియదు కానీ.. వచ్చిన వారు వచ్చినట్టు వెళ్లిపోయారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం దీనినితీవ్రంగా తప్పుబడుతున్నాయి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అప్పుడే ఎమ్మెల్యే అయిపోయాడా? అంటూ సటైర్లు వేస్తున్నారు.