అధికార పార్టీ వైసీపీలో అసమ్మతి గుబులు రేపుతోంది. కనీసంలో కనీసం 30 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపో తున్నారని పార్టీ అధిష్టానమే అంచనా వేస్తోంది. వీరిలో ఇప్పటికే కోనేటి ఆదిమూలం, వరప్రసాద్, గుమ్మనూరు జయరాం, కొలుసు పార్థసారతి, జ్యోతుల చంటిబాబు.. ఇలా అనేక మంది ఉన్నారు. వీరంతా నేరుగానే పార్టీపై గుస్సా వ్యక్తపరుస్తున్నారు. దీనికి కారణం.. ఏకంగా రెండు నెలల ముందుగానే ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్, పార్టీ అధినేత కీలక నిర్ణయం తీసుకుని.. అభ్యర్థులను ప్రకటించడమే. పలు నియోజకవర్గాలకు(69) ఆయన సమన్వయ కర్తలనుఖరారు చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది లాభిస్తుందని సీఎం జగన్ అంచనా వేసి ఉంటారు. ఇది ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అసలు సిసలు కీలక వ్యూహం ఇప్పుడు మొదలైంది. ఏ పార్టీకైనా ప్రాణప్రదమైన రాజ్యసభ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడదు. ముఖ్యంగా ఇప్పుడు ఇదే సమస్య వైసీపీకి ఎదురైంది. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలు ఈ ఏడాది ఏప్రిల్ 4తో ఖాళీ కానున్న నేపథ్యంలో వాటికి నోటిఫి కేషన్ వచ్చింది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా ఎమ్మెల్యేలు వేయాల్సిన ఓట్లు. వారే ఓటర్లుగా మారనున్నారు. సరిగ్గా ఇదే ఇప్పుడు వైసీపీ పెను సవాలుగా మారింది.
అసెంబ్లీలో 151 మంది వైసీపీకి సబ్యులు ఉన్నారు. వీరిలో నలుగురిని పార్టీ సస్పెండ్ చేసింది. మరో నలుగురు టీడీపీ నుంచి మద్దతుగా ఉన్నారు. ఇంత వరకు లెక్క సరిపోయింది. వీరితో రాజ్యసభ ఎన్నికలకు వెళ్తే.. వైసీపీ మూడు సీట్లను కొట్టేస్తుంది. కానీ.. ఎటొచ్చీ.. ఇప్పుడు జగన్ తీసుకున్న సమన్వయ కర్తల నియామకం ప్రకటన గుబులు రేపుతోంది. సమన్వయ కర్తలను ఒక ఉద్దేశంతో నియమిస్తే.. ఇప్పుడు దానికన్నా ముందే దిగివచ్చిన పెద్దల సభ ఎన్నికలు పార్టీని సెగ పెట్టిస్తున్నారు. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉండడం.. ఇంకా ప్రకటించని నియోజకవర్గాలలోనూ ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటూ ఉన్న నేపథ్యంలో వైసీపీ తరఫుపాజిటివ్‌గా ఎవరు ఓటెత్తుతారు? అఏది ప్రశ్న.
నిజానికి రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉంటే.. సమన్వయ కర్తల వ్యవహరాన్ని సీఎం జగన్ వాయిదా వేసుకుని ఉండేవారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆయన మరిచిపోయారా? లేక.. ఎవరూ సలహాదారులు గుర్తుచేయలేదా? అనేది కూడా కీలకంగా మారింది. ఇవన్నీ ఎలా ఉన్నా.. తాను తీసుకున్న నిర్ణయాన్ని జవదాటరన్న భావన ఆయనలో ఉండి ఉండాలి. కానీ, అనుకున్న విధంగా రాజకీయాలు లేవు. టీడీపీ-జనసేన పుంజుకున్న దరిమిలా.. టికెట్లు ఆశించే వారు.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అటు మొగ్గితే.. మొత్తానికే వైసీపీకి ఒక సీటు పోవడం ఖాయమనే అంచనాలు తాడేపల్లి వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. మరి..జగన్ ఊహించి చేశారా? ఊహించలేదా? అనేది చూడాలి.