నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలు: పీకే

బీజేపీకి మద్దతు పలుకుతూ ఎన్డీఏ కూటమిలో బీహార్ సీఎం నితీష్ కుమార్ చేరడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై గతంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి పని చేసిన రాజకీయ వ్యూహకర్త, ఐ ప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలని, ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో కనపడరని పీకే జోస్యం చెప్పారు. నితీష్ కుమార్ పచ్చి మోసగాడని, సీఎం పదవి దక్కించుకునేందుకు ఏమైనా చేస్తాడని దుయ్యబట్టారు.

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జేడీయూకు 20 కన్నా ఎక్కువ సీట్లు రావని జ్యోస్యం చెప్పారు పీకే. నితీష్ ఏ కూటమిలో చేరినా అంతకుమించి సీట్లు దక్కించుకోలేరని, ఒకవేళ 20 కంటే ఎక్కువ సీట్లు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ గెలుచుకుంటే తాను తన వృత్తిని వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. ఇక, బీజేపీతో నితీష్ మిత్ర బంధం ఎక్కువ రోజులు కొనసాగదని, గట్టిగా చెప్పాలంటే 2025 శాసనసభ ఎన్నికల వరకు బీజేపీతో పొత్తు కొనసాగక పోవచ్చని అన్నారు. సీఎం సీటు కాపాడుకునేందుకు నితీష్ కుమార్ ఏమైనా చేస్తారని, అందుకే బీహార్ ప్రజలు నితీష్ ను తిరస్కరిస్తున్నారని అన్నారు.

నితీష్ తో జతకట్టడం వల్ల బీజేపీకే నష్టం ఎక్కువ అని చెప్పుకొచ్చారు. నితీష్ తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే బిజెపి మరిన్ని సీట్లు గెలుచుకుని బలమైన స్థితిలో ఉండేదని అన్నారు. మరి, పీకే కామెంట్లపై నితీష్ కుమార్ స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.