జగన్..నాది సీమ రక్తం: చంద్రబాబు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ‘రా కదిలి రా’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పీలేరులో తాజాగా నిర్వహించిన సభలో సీఎం జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజా కోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం దగ్గర పడిందని, వైసీపీకి కౌంటర్ మొదలైందని చంద్రబాబు అన్నారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో జరిగేది గెలిచేది టీడీపీ-జనసేన కూటమేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇక భీమిలిలో ఈ రోజు జగన్ మొదలుపెట్టబోతున్న ‘సిద్ధం’ సభపై కూడా చంద్రబాబు స్పందించారు.

ఎన్నికలు వస్తేనే ప్రజల్లోకి జగన్ వస్తారని, సంపూర్ణ మద్య నిషేధంపై మాట తప్పిన జగన్ కు ఓటు అడిగే హక్కు లేదని చంద్రబాబు విమర్శించారు. అబద్దాలలో జగన్ పిహెచ్డి చేశారని, పది రూపాయలిచ్చి 100 దోచుకోవడమే జగన్ విధానమని ఎద్దేవా చేశారు. ఇలాంటి జలగ మనకు వద్దని, వై నాట్ పులివెందుల అంటూ జగన్ ను ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక, రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు జగన్ కు అభ్యర్థులు దొరకడం లేదని చురకలంటించారు. తమ కసినంత జగన్ పై చూపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల తర్వాత వైసీపీ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందని జోస్యం చెప్పారు.

వైసీపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. 2019లో ముద్దులు పెట్టి బుగ్గలు నొక్కి జనాన్ని మోసం చేసిన జగన్ అధికార అహంకారాన్ని దించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. తాను సీమ బిడ్డనని, తనలో ఉన్నది సీమ రక్తమని చంద్రబాబు చెప్పారు. రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు ఎన్నో ఆలోచనలు చేశానని, కానీ, జగన్ ఆ ఆలోచనలకు గండి కొట్టాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.