లావు ఎంట్రీ.. టీడీపీకి మ‌రింత ఉత్సాహం?

వైసీపీ నాయ‌కుడు, యువ ఎంపీ, న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు స‌భ్యులు లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. పార్టీలో ఇమ‌డ‌లేక‌, పార్టీలో నెల‌కొన్న అనిశ్చితి నేప‌థ్యంలోనే తాను రాజీనామా చేసిన‌ట్టు ఆయ‌న చెప్పారు. అయితే..ఇప్పుడు ఆయ‌న చూపు టీడీపీ వైపు ఉంద‌నే చ‌ర్చ సాగుతోంది. లావు తండ్రి.. లావు పెద‌ర‌త్త‌య్య‌.. వాస్త‌వానికి టీడీపీకి అనుకూలం. వీరి యూవ‌ర్సిటీ ఏర్పాటు స‌హా అనేక సంద‌ర్భాల్లో టీడీపీ సర్కారు స‌హాయం చేసింది.

ఈ నేప‌థ్యంలో లావు పెద‌ర‌త్త‌య్య‌.. టీడీపీకి సానుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులును పార్టీలోకి ఆహ్వానించి.. టికెట్ ఇచ్చింది. కానీ, ఐదేళ్ల‌లోనే అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లు.. ఎంపీని ఉక్కిరిబిక్కిరికి గురి చేశాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక‌, లావుకు రాజ‌కీయంగా చూస్తే ఎలాంటి మైన‌స్‌లు లేవు. అవినీతి ఆరోప‌ణ‌లు అస‌లే లేవు. ఆయ‌న అభివృద్ది నాయ‌కుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వంతో సంబంధం లేకుండా.. న‌ర‌స‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధిని ప‌రుగులు పెట్టించారు. దీంతో పేట ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల లోనూ లావుకు ప్ర‌జాభిమానం మెండుగానే ఉంది. ఇదే విష‌యాన్ని వైసీపీకి ఇక్క‌డి నాయ‌కులు కూడా చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ లావును ప్రాతిప‌దిక‌గా తీసుకోలేదు. దీంతో ఆయ‌న వెళ్లిపోయారు.ఇక‌, ఇప్పుడు టీడీపీ నేత‌లు ఆయ‌నకు ట‌చ్‌లో ఉన్నార‌ని తెలిసింది. లావు తండ్రి కూడా.. టీడీపీవైపు వెళ్లాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం.

కృష్ణ‌దేవ‌రాయులు క‌నుక టీడీపీలోకి వ‌స్తే.. న‌ర‌స‌రావుపేట ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు గుర్రం ఎక్క‌డం సునాయాసం అవుతుంద‌ని పార్టీ నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న కు ఉన్న ఇమేజ్‌తోపాటు.. స్తానికంగా వివాద ర‌హితుడు అనే పేరు కూడా ప‌నిచేస్తుంద‌ని భావిస్తున్నారు. మొత్తంగా .. లావు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న‌ట్టు స‌మాచారం. ఆయ‌న వ‌స్తే.. టీడీపీ న‌ర‌స‌రావు పేట టికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉండ‌డం గ‌మ‌నార్హం.