సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం తమ పార్టీలోకి విపక్ష బీఆర్ఎస్ కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు వస్తున్నట్లుగా చెప్పారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్.. హరీశ్ తో పాటు పలువురు మాజీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి మరింత ఘాటుగా రియాక్టు అయ్యారు.
యాదాద్రి.. భద్రాద్రి థర్మల్ విద్యుత్కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్ గఢ్ లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న ఉద్దేశంతోనే తన మీద మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. విద్యుత్కేంద్రాల్లో అవకతవకలపై విజిలెన్స్.. సిట్టింగ్ జడ్జి విచారణ తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు వెళుతుందన్న ఆయన.. తమ ప్రభుత్వం పడిపోదన్నారు.
ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్న ఆయన.. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో పది మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని వ్యాఖ్యానించటం గమనార్హం. కాంగ్రెస్ లోకి 30 మంది ఎమ్మెల్యేలు వస్తారన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్రుణప్రాయంగా విడిచిపెట్టానని.. అలాంటి తనపై జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు.
వందరోజుల్లోపు తాము హామీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి.. కరెంటు బిల్లులు కొట్టొద్దన్న మాటలు మాట్లాడటం మానుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ కు సూచన చేశారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ సర్కారు మీదా.. ముఖ్యమంత్రి రేవంత్ మీద బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న వేళ.. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ లు సరైన రీతిలో రియాక్టు కావట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వేళ.. బీఆర్ఎస్ కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారన్న మాటలతో ఆయన ఆ విమర్శల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారని చెప్పాలి. అయితే.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గౌరవనీయ స్థానాల్ని సొంతం చేసుకుంటే తప్పించి పట్టు సాధించలేదన్న విషయాన్ని కోమటిరెడ్డి గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు.