కరోనా సంక్షోభ సమయంలోనూ ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నార. అసలే ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతోన్న ఏపీపై కరోనా రూపంలో పెను విపత్తు పిడుగులా పడడంతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడింది.
అయినప్పటికీ సంక్షేమ పథకాల అమలులో…మాత్రం జగన్ వెనుకడగుడు వేయడం లేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని నడిపేందుకు, సంక్షేమ పథకాల అమలుకు జగన్ వేరే ఆదాయ మార్గాలను అన్వేషించారు. ఖజానా నింపుకునేందుకు మెజారిటీ ప్రజలు పెద్దగా పట్టించుకోని అంశాలో ధరలను పెంచారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారీగా మద్యం ధరల పెంపు, పెట్రో, డీజిల్ ధరలు, భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు ఇలా సైలెంట్ గా జగన్ బాదుడు మొదలు పెట్టారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వీటితో పాటు సామాన్య ప్రజలపై భారం పడే ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు కూడా పెంచేశారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా ధరలను అమాంతం పెంచుకుంటూ పోతున్న జగన్….తాజాగా రవాణాశాఖలో పన్నులు పెంచాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
రవాణా శాఖలో పన్నుల పెంపు ద్వారా సుమారు రూ. 400 కోట్ల అదనపు ఆదాయం రాబట్టాలని జగన్ సర్కార్ యోచిస్తోందట. టూవీలర్, ఫోర్ వీలర్ల లైఫ్ ట్యాక్స్ పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 2 రకాల శ్లాబుల్లో 1- 3 శాతం వరకు పన్ను పెంపు ఉండబోతోందట. ప్రస్తుతం 9.12 శాతంగా ఉన్న టూవీలర్, ఫోర్ వీలర్ లైఫ్ ట్యాక్స్‌ను 2010 తరువాత పెంచలేదు. టూ వీలర్ ట్యాక్స్ పెంచడం ద్వారా ఖజానాకు రూ. 174 కోట్ల, ఫోర్ వీలర్లకు లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా రూ. 140 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.
గూడ్స్ వాహనాలకు వివిధ శ్లాబుల్లో 10-15 శాతం పెంపు ఉండబోతోందట. వివిధ వాహనాలకు విధించే గ్రీన్ ట్యాక్స్ పెంపు ద్వారా అదనంగా రూ. 30 కోట్లు ఖజానాకు చేరనున్నాయట. గ్రీన్ ట్యాక్స్ పెంపు నుంచి ఆటోలకు మినహాయింపు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.ఇలా కొన్ని ధరలను పెంచి వ్యూహాత్మకంగా ఆదాయం పెంచుకుంటున్న జగన్…కట్టె విరగకుండా….పాము చావకుండా ఖజానాను నింపుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ తరహాలోనే ఖజానా నింపేందుకు జగన్ సైలెంట్ బాదుడు కార్యక్రమాలు మరిన్ని చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates