తామున్న పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వగానే.. ఆ పార్టీ నుంచి నేతలు అధికార పార్టీలోకి జంప్ చేయడం మామూలే. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచాక ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వైకాపాలోకి నేతలు వలస వెళ్లారు. ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ చేశారు.
ఐతే గత ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పదవికి రాజీనామా చేయకుండా తమ పార్టీలోకి ప్రవేశం లేదని తేల్చేయడంతో జంప్ జిలానీ ఎమ్మెల్యేలకు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లయింది. అలాగని వైకాపాలోకి వలసలేమీ ఆగిపోలేదు.
పదవుల్లోలేని నేతలు పెద్ద ఎత్తున వైకాపాలోకి వెళ్లిపోయారు. పదవులున్న వాళ్లలో కూడా కొంతమంది అనధికారికంగా వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించే. వైకాపా కండువా కప్పుకోకపోయినా.. ఆయన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేగానే చూస్తున్నారు.
ఐతే వంశీ సహా వైకాపాలోకి వెళ్లిన చాలామంది నాయకులు ప్రస్తుతం అంతర్మథనంలో ఉన్నట్లు సమాచారం. వంశీ విషయమే తీసుకుంటే.. ఆయనకు వైకాపాలో ఆశించిన ప్రాధాన్యం దక్కట్లేదు. పార్టీ మారినందుకు ఆయనకు ఇచ్చిన హామీలేవీ సీఎం జగన్ నెరవేర్చలేదట. గన్నవరం నియోజకవర్గంలో వైకాపా నేతలు, కార్యకర్తలు వంశీకి ఏమాత్రం సహకరించడం లేదు. ఈయన నాయకత్వాన్నే వాళ్లు అంగీకరించట్లేదు. ఓవైపు హామీలు నెరవేరక, పనులు జరగక.. ఇంకోవైపు స్థానిక వైకాపా నాయకత్వంతో వర్గపోరుతో వంశీ విసిగిపోయినట్లు చెబుతున్నారు.
మరోవైపు చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైకాపాలోకి అనధికారికంగా జంప్ అయిన కరణం బలరాం పరిస్థితి కూడా ఇలాగే ఉందట. అక్కడ వైకాపా తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణ మోహన్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంది పరిస్థితి. మరోవైపు బలరాంకు సీఎం నుంచి అపాయింట్మెంటే దక్కట్లేదని సమాచారం.
టీడీపీలో ఉండగా ఒక వెలుగు వెలిగిన విజయవాడ నేత దేవినేని అవినాష్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నట్లు సమాచారం. తమ వ్యాపారాల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వైకాపా కండువా కప్పుకున్న అవినాష్‌ను ఆ పార్టీలో పట్టించుకునేవాళ్లే కరవయ్యారు. ప్రకాశం జిల్లా నేత శిద్ధా రాఘవరావు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.
అధికార పార్టీలో ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలుండటం.. ఆ పార్టీలోనే పదవులకు తీవ్రమైన పోటీ ఉండటం.. వర్గపోరు కొనసాగుతుండటంతో టీడీపీ నుంచి వచ్చిన నాయకులను పట్టించుకునేవాళ్లే కరవయ్యారు. దీంతో ఎందుకు పార్టీ మారామా అన్న అంతర్మథనం వలస నాయకుల్లో మొదలైనట్లు తెలుస్తోంది. కొత్తగా పార్టీ మారాలనుకుంటున్న వాళ్లను వీళ్లు నిరుత్సాహపరుస్తున్నట్లు సమాచారం.