తెలుగుదేశంపార్టీకి సంబంధించి రెండుపేటల్లోను ఇపుడిదే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఇపుడు విషయం ఏమిటంటే గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాలు చాలా కీలకం. చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బాగా సీనియర్ నేత. మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. 2014-19 మధ్య మంత్రిగా కూడా పనిచేశారు. ఇంతటి చరిత్రున్న ప్రత్తిపాటికి రాబోయే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీ లేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి అంటే పార్టీనేతల్లోనే బాగా వ్యతిరేకత పెరిగిపోయిందని సమాచారం.
అందుకని చిలకలూరిపేటలో పోటీచేయించటం కన్నా నరసరావుపేటలో పోటీచేయిస్తే ఎలాగుంటుందని చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. చిలకలూరిపేట నేతలు ఈమధ్యనే చంద్రబాబును కలిసి ప్రత్తిపాటికి తప్ప ఇంకెవరికైనా టికెట్ ఇవ్వాలని గట్టిగానే చెప్పారట. అందుకనే చంద్రబాబు కూడా టెలిఫోనిక్ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. అలాగే నరసరావుపేట నియోజకవర్గంలో కూడా ఇదే పద్దతిలో సర్వే చేయిస్తున్నట్లు పార్టీవర్గాల టాక్ వినిపిస్తోంది.
ప్రత్తిపాటితో నరసరావుపేటలోని అట్లా చిన్నవెంకటరెడ్డి, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఇద్దరిపైనా టెలిఫోనిక్ సర్వే జరుగుతోంది. ఇపుడు నరసరావుపేట ఇన్చార్జిగా చదలవాడ పనిచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తనకే టికెట్ అని చదలవాడ చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది సడెన్ గా చంద్రబాబు టెలిఫోనిక్ సర్వే జరిపిస్తుండటంతో చదలవాడలో టెన్షన్ పెరిగిపోతోంది. పై ముగ్గురి నేతల్లో ఎవరిని అభ్యర్ధిగా మద్దతు ఇస్తున్నారనే అంశంపై పార్టీ నేతలతో పాటు వివిధ వర్గాల్లో కూడా సర్వే చేయిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏమిటంటే చిలకలూరిపేటలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రత్తిపాటికి నరసరావుపేట నేతలు, క్యాడర్ మద్దతిస్తారా అన్నది కీలకమైన ప్రశ్న.
వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఎంఎల్ఏలకు టికెట్లు నిరాకరిస్తున్నారు. కొందరు మంత్రులు, ఎంఎల్ఏలను నియోజకవర్గాలు మార్చేస్తున్నారు. అభ్యర్ధుల విషయంలో జగన్ ధైర్యంగా మార్పులు చేస్తున్నట్లే చంద్రబాబు కూడా చేయగలరా ? అలా చేయగలిగితే ఫలితం సానుకూలంగా ఉంటుందని తమ్ముళ్ళు అభిప్రాయపడుతున్నారు. జగన్ అంటే ఏ పార్టీతోను పొత్తులేదు కాబట్టి స్వేచ్చగా ధైర్యంగా చేయగలుగుతున్నారు. కానీ చంద్రబాబు పరిస్ధితి అలాకాదు. జనసేనతో పొత్తు కారణంగా టికెట్ల ఫైనల్ విషయంలో కాస్త అయోమయం తప్పటంలేదు. మరి ప్రత్తిపాటి విషయంలో చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates