“వైసీపీకి ఏళ్ల తరబడి సేవ చేశా. నిజాయితీగా ఉన్నా. అయినా నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీనికి కారణం ఎవరో అందరికీ తెలుసు. అయితే.. నేను పోటీ నుంచి విరమించుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా” అని ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం తిరువూరు ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు రక్షణ నిధి అన్నారు. తాజాగా ప్రకటించిన వైసీపీ నాలుగో జాబితాలో తిరువూరు టికెట్‌ను పార్టీ ఇటీవల టీడీపీ నుంచి వచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్న నల్లగట్ల స్వామిదాసుకు కేటాయించింది.
తిరువూరువైసీపీ సమన్వయ కర్తగా నల్లగట్ల స్వామిదాసును వైసీపీ ప్రకటించింది. దీనిపై తాజాగా రక్షణ నిధి మాట్లాడుతూ.. నియోజకవర్గం ఇంచార్జ్‌ని మార్చుతున్న క్రమంలో కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పలే దని అన్నారు. పార్టీ కోసం.. తాను అనేక కార్యక్రమాలు చేశానని, పార్టీ ఓడిపోయిన సందర్భంలోనూ తాను గెలిచానని.. కానీ, ఇప్పుడు తనకు అన్యాయం చేశారని అన్నారు. ఎవరో ఎంపీ చెప్పాడని(కేశినేని నాని) తనకు సీటు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్లగట్ల స్వామిదాసుకు ఎలా సహకరిస్తామని రక్షణ నిధి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తాన న్నారు. అయితే.. ఏపార్టీ తరఫున, ఎలా ? అనేది తర్వాత చెబుతానని వ్యాఖ్యానించారు. పోటీ మాత్రం ఖాయమని వెల్లడించారు. ఇదిలావుంటే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న రక్షణనిధికి.. గత 2022లోనే మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే.. అప్పట్లో ఆయనకు పదవి దక్కలేదు.
కానీ, ఇంతలోనే ఆయనను తప్పిస్తూ.. నియోజకవర్గం ఇంచార్జ్ విషయంలో వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే ఇప్పుడు రక్షణనిధికి షాక్‌కు గురి చేసింది. అయితే.. పార్టీ వర్గాలు మాత్రం ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే ఆలోచన ఉందని.. అందుకే టికెట్ ఇవ్వలేదని అంటున్నాయి. పార్టీ గెలుపునకు కృషి చేయాలని సీఎం జగన్ ఇప్పటికే ఆయనకు చెప్పారని, ఆయనకు ప్రాధాన్యం తగ్గించరని చెబుతున్నాయి.