అది నిజ‌మైతే.. నియోజ‌క‌వ‌ర్గం వ‌దిలేస్తా: కొడాలి నాని

గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు ఫైర్‌బ్రాండ్ కొడాలి నాని మ‌రోసారి హీటెక్కించారు. తాజాగా ఆయ‌న టీడీపీపై నిప్పులు చెరిగారు. దివంగ‌త ఎన్టీఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని టీడీపీ నాయ‌కులు గుడివాడ‌లో కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా టీడీపీఅధినేత చంద్ర‌బాబు నాయుడు రా..క‌ద‌లిరా! స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పెద్ద ఎత్తున గుడివాడ‌కు చేరుకున్నారు.

ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని.. టీడీపీపై కొడాలి నాని ఫైర్ అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచే ప‌రిస్థితి లేద‌న్నారు. ఎంత మంది వ‌చ్చినా.. త‌న‌ను ఓడించ‌లేర‌ని వ్యాఖ్యానించారు. అల్లుడి కోసం.. బాల‌య్య జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను అవ‌మానిస్తున్నార‌ని, ఆయ‌న ఫ్లెక్సీలు కూడా తీసేయాల‌ని అన్నార‌ని.. చెప్పుకొచ్చారు. గుడివాడ‌లో గ‌త ఎన్నిక‌ల్లోనే త‌న‌ను ఓడిస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించార‌ని అన్నారు. కానీ, మూడు స‌భ‌లు పెట్టి.. ఎన్ని మాట‌లు చెప్పినా.. గుడివాడ ప్ర‌జ‌లు వినిపించుకోలేద‌న్నారు.

ఇప్పుడు.. అభ్య‌ర్థి మాత్ర‌మే మారాడ‌ని(గ‌త ఎన్నికల్లో దేవినేని అవినాష్ పోటీ చేయ‌గా.. ఇప్పుడు వెనిగండ్ల రాము టీడీపీ అభ్య‌ర్థిగా ఉన్నారు) కానీ, పార్టీ ప‌రిస్థితి ఏమీ మార‌లేద‌న్నారు. ఎవ‌రు ఎన్ని వ్యాఖ్య‌లు చేసినా.. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఊడిపోయిన వెంట్రుక‌ను కూడా పీక‌లేర‌న్నారు. అదేవిధంగా త‌న‌పై ఎంత మందిని పోటీ పెట్టినప్ప‌టికీ.. త‌న వెంట్రుక‌లు కూడా పీక‌లేర‌ని అన్నారు.

ఎన్టీఆర్ కు నివాళులు అర్పించినంత మాత్రాన గుడివాడ ప్ర‌జ‌లు న‌మ్మ‌బోర‌ని అన్నారు. నాని ఎలాంటి వాడో గుడివాడ ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌న‌దే విజ‌య‌మ‌ని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ వ్యాఖ్య‌లు ఆ పార్టీ నాయ‌కుల‌కు బాగానే ఉంటాయ‌ని.. ప్ర‌జ‌లు బాగోలేద‌ని అన్నారు.

మ‌రోవైపు.. గుడివాడ‌లో ఏర్పాటు చేసిన రా..క‌ద‌లిరా! స‌భ‌పైనా నాని విమ‌ర్శ‌లు గుప్పించారు. రెండు ల‌క్ష‌ల మందిఈ స‌భ‌కు వ‌స్తున్నార‌ని.. ముందు ప్ర‌చారం చేశార‌ని.. కానీ, త‌ర్వాత ఈ టార్గెట్‌.. కాస్తా.. ల‌క్షకు త‌గ్గించుకున్నార‌ని అన్నారు. ఇప్పుడు ఏర్పాట్లు చూస్తే.. ఐదు వేల మందికి కూడా చేయ‌లేద‌ని అన్నారు. 5 వేల మందికి మాత్ర‌మే కుర్చీలు వేశార‌ని.. అంత‌క‌న్నా.. ఒక్క సీటు ఎక్కువ‌గా ఉన్నా.. తాను నియోజ‌క‌వ‌ర్గం వదిలి వెళ్లిపోతాన‌ని కొడాలి నాని చెప్పుకొచ్చారు.