రైతుబంధు పథకం అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నది. గురువారం నుండి అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయబోతున్నది. ఇప్పటికే 29 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతుబంధు పథకంలో అర్హతకు 2 ఎకరాలను అర్హతగా మొదటి విడతలో ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ముందు రెండు ఎకరాలను సాగుచేసుకుంటున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేసీయార్ పాలనలో ఏమి జరిగిందంటే రైతుబంధు పథకంలో పెద్ద పెద్ద భూస్వాములకు కూడా డబ్బులు అందాయి. అసలు సదరు భూస్వాములు వ్యవసాయమే చేయటంలేదు. తమ భూములను కౌలుకు ఇచ్చేసి తాము నగరాల్లోను లేదా విదేశాల్లోను ఉంటున్నారు. ప్రభుత్వం జమచేస్తున్న నిధులన్నీ సదరు భూస్వాముల ఖాతాల్లో జమవుతున్నాయే కాని నిజంగా పొలంలో 24 గంటలూ 365 రోజులు కష్టపడుతున్న కౌలు రైతులకు అందటంలేదు. ఈ విషయంలో కౌలురైతులు, రైతుసంఘాల నుండి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా కేసీయార్ పట్టించుకోలేదు.
కౌలు రైతులను రైతులుగా గుర్తించటానికి కూడా కేసీయార్ ప్రభుత్వం ఇష్టపడలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి రైతుబంధు పథకం దుర్వినియోగం కూడా ప్రధాన కారణాల్లో ఒకటి. అందుకనే ఈ పథకం అమలుకు రేవంత్ ప్రభుత్వం బ్రేకులు వేసింది. పథకంలో నిజమైన అర్హులను గుర్తించిన తర్వాతే రైతుబంధు నిధులను ఖాతాల్లో జమచేయాలని డిసైడ్ చేసింది. పరిశీలనలో భాగంగా క్షేత్రస్ధాయి నుండి వివరాలు సేకరించింది. అన్నీ వివరాలు గమనించిన తర్వాత ముందుగా రెండెకరాలున్న రైతులను మొదటి విడతలో అర్హులుగా గుర్తించింది.
అందుకనే వీళ్ళ ఖాతాల్లో రైతుబంధు పథకం నిధులను జమచేస్తోంది. రెండో విడత ఆ తర్వాత మూడోవిడత సర్వేలు చేయించుకుని అర్హులైన రైతులను గుర్తించాలన్నది ప్రభుత్వం టార్గెట్. అందుకనే పథకంలో లబ్దిదారులు, అర్హుల జాబితాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నది రేవంత్ ఆలోచన. ఈ ప్రక్షాళన సక్రమంగా జరిగితే అప్పుడు రైతుబంధు పథకంలో నిజమైన అర్హులెవరో తేలటంతో పాటు నిధుల వృధాను కూడా అరికట్టినట్లవుతుంది. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates