21న మొదటి జాబితా విడుదల ?

ఈనెల 21వ తేదీన టీడీపీ-జనసేన మొదటి జాబితా విడుదలకు ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం. తొలిజాబితాలో టీడీపీ సిట్టింగుల్లో చాలామందికి టికెట్లు ఖాయంగా ఉంటాయని అంటున్నారు. సిట్టింగులందరికీ టికెట్లు ఖాయమని చంద్రబాబునాయుడు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాజమండ్రి రూరల్ సీటుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగా పట్టుబడుతున్నారు. తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కందుల దుర్గేష్ రూరల్ నియోజకవర్గం నుండి పోటీచేయాలని గట్టి పట్టుదలగా ఉన్నారు.

ఈ కారణంగా టీడీపీ ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిస్ధితి అయోమయంలో పడింది. రాబోయే ఎన్నికల్లో పోటీచేయేది తానే అంటు ఇటు గోరంట్ల అటు కందుల ఇద్దరూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సీటును వదిలేసినా మిగిలిన 18 మందికి టికెట్లు ఖాయమనే అనుకుంటున్నారు. మొదటిజాబితాలో సుమారు 70 మంది అభ్యర్ధులు ఉండబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఇందులో టీడీపీ తరపున 50 మంది, జనసేన తరపున 20 మంది ఉంటారని సమాచారం.

రెండుపార్టీలు పోటీచేయబోయే సీట్ల సంఖ్య, నియోజకవర్గాలు ఇప్పటికే చంద్రబాబు, పవన్ స్ధాయిలో ఫైనల్ అయిపోయాయి. అయితే ఆ వివరాలను బహిరంగంగా ప్రకటించలేదు. జనసేన నేతలేమో 60 నియోజకవర్గాల్లో పోటీచేయాల్సిందే అని పట్టుబడుతున్నారు. అలాగే 8 లోక్ సభసీట్లు తీసుకోవాలని పవన్ పై ఒత్తిడి తెస్తున్నారు. చంద్రబాబేమో 25 అసెంబ్లీలు, 2 లేదా 3 పార్లమెంట్ స్ధానాలు ఇవ్వటానికి రెడీ అయినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మధ్యేమార్గంలో పవన్ 50 అసెంబ్లీ సీట్లు, ఐదు పార్లమెంటు స్ధానాలు  కావాలని లిస్టు ఇచ్చారట.

పవన్, జనసేన నేతల డిమాండ్లకు చంద్రబాబు ఆఫర్ కు మధ్య చాలా వ్యత్యాసముంది. మరి దీన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటారో చూడాలి. ఈ జాబితాలోనే పవన్ పోటీచేయబోయే నియోజకవర్గం కూడా ఉంటుందని అనుకుంటున్నారు. ఇది కాకుండా సుమారు 8 మంది పార్లమెంటు స్ధానాలను కూడా ప్రకటించే అవకాశముందని పార్టీవర్గాల సమాచారం. ఏదేమైనా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధులను ఫైనల్ చేసేస్తున్నారు. తొందరలోనే టీడీపీ-జనసేన కూటమి కూడా రెడీ అవుతోంది. అంటే ఎన్నికల వేడి మరింతగా పెరిగిపోవటం ఖాయం.