15 అసెంబ్లీ, 2 పార్ల‌మెంటు… జ‌న‌సేన‌కు తేలిన లెక్క‌!

వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు ఇచ్చే సీట్ల విష‌యాన్ని చంద్ర‌బాబు తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. మొత్తం 175 స్థానాల అసెంబ్లీలో 15 స్థానాల‌ను జ‌న‌సేన‌కు కేటాయించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. దీనిపై సుదీర్ఘంగా శ‌నివారం రాత్రంగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. అదేవిధంగా రెండు పార్ల‌మెంటు స్థానాల‌ను కూడా.. జ‌న‌సేన‌కు కేటాయించిన‌ట్టు తెలిసింది.

అదేవిధంగా జంపింగుల విష‌యం కూడా ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుతం వైసీపీలో టికెట్లు ద‌క్క‌ని ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు జ‌న‌సేన‌లో చేరేందుకు రెడీ అయ్యారు. వీరిలో ఒక‌రు విశాఖ‌ప‌ట్నానికి చెందిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ‌యాద‌వ్ జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. ఈయ‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అదేవిధంగా మ‌చిలీప‌ట్నం నుంచి వ‌చ్చిన ఎంపీ బాల‌శౌరి త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం తీసుకోనున్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌చిలీపట్నం టికెట్‌ను కూడా జ‌న‌సేన‌కు కేటాయించేందుకు చంద్ర‌బాబు అంగీక‌రించారు. ఈ రెండు స్థానాల‌తోపాటు.. పిఠాపురం, విజ‌య‌వాడ వెస్ట్‌, చీరాల‌, ద‌ర్శి, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రూర‌ల్‌, తిరుపతి, మాడుగుల‌, పోల‌వ‌రం, పెడ‌న‌, నంద్యాల‌, అనంత‌పురం రూర‌ల్‌, ధ‌ర్మ‌వ‌రం, క‌ళ్యాణ‌దుర్గం, పూత‌ల‌ప‌ట్టు వంటి నియోజ‌క‌వ‌ర్గాల‌ను జ‌న‌సేన‌కు కేటాయించేందుకు చంద్ర‌బాబు దాదాపు అంగీకారం తెలిపిన‌ట్టు తెలిసింది. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌చిలీప‌ట్నం కేటాయించారు.

మ‌రో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంపై క‌స‌రత్తు చేసిన త‌ర్వాత‌.. కేటాయిస్తామ‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల వివాదాలు రాకుండా.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయ‌కుండా.. ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకుని.. అడుగులు వేయాల‌ని ఇరు పార్టీల అధినేత‌లు నిర్ణ‌యించారు. ముఖ్యంగా పొత్తులు దెబ్బ‌తిన‌కుండా చూసుకోవాల‌ని నిర్ణ‌యించారు. బీజేపీ క‌లిసి వ‌స్తే.. అప్పుడు చూడాల‌ని.. లేక‌పోతే.. క‌మ్యూనిస్టుల‌ను క‌లుపుకొని ముందుకు వెళ్లాల‌ని తాజా చ‌ర్చ‌ల్లో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది.