వైసీపీ రెబల్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయకుడు.. కనుమూరి రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టు అభయం ఇచ్చింది. సంక్రాంతిని పురస్కరించుకుని తన సొంత నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గానికి వెళ్తానని.. అయితే.. ఏపీ పోలీసులు తనపై కేసులుపెట్టి నిర్బంధించే అవకాశం ఉందని.. దీనిని నిలువరించాలని.. ఆయన కొన్ని రోజుల కిందట పిటిషన్ దాఖలు చేశారు. తనపై కేసులు నమోదు చేయకుండా పోలీసులను, ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. సంక్రాంతిని తన కుటుంబంతో సహా జరుపుకొనేలా అవకాశం కల్పించాలని కోరారు.
దీనిపై విచారణ చేపట్టి రాష్ట్ర హైకోర్టు.. తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామపై ఎలాంటి కేసులు నమోదు చేయాల్సి వచ్చినా.. ముందుగా ఆయనకు 41 ఏ కింద నోటీసులు ఇవ్వాలని.. తగిన సమయం ఇచ్చి ముందుగా వివరణ తీసుకోవాలని సూచించింది. అంతేకాదు.. ఆయనను నిర్బంధించడానికి వీల్లేదని తెలిపింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు వ్యవహరించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. “నిర్బయంగా మీరు ఊరెళ్లండి” అని రఘురామ తరఫున న్యాయవాదికి ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది.
ఎంపీ రఘురామపై ఎలాంటి ఫిర్యాదులున్నా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాల్సిందేనని ఏపీ పోలీసుల తరఫున న్యాయవాదికి హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా సరే.. కేసు పెట్టాలంటే ముందుగా ఆయనకు తెలియపరిచి.. సంబంధిత నోటీసులు ఇవ్వాలని, ఆయన నుంచి వివరణ తీసుకున్న తర్వాతే.. కేసులు పెట్టాలని తెలిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ వైవీ రవిప్రసాద్, ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. దీంతో రఘురామ ఏపీకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఎంపీగా గెలిచిన తర్వాత.. ఆయనవైసీపీతో విభేదించిన విషయం తెలిసిందే. తర్వాత.. ఆయన దాదాపు ఏపీకి రావడమే లేదు. గతంలో ఏపీ సీఐడీ ఆయనను అరెస్టు చేయడం.. తనపై పోలీసులు భౌతిక దాడులు చేశారని ఎంపీ రఘురామ పేర్కొనడం.. దీనిపైనా విచారణ జరగడం తెలిసిందే.