తనను వైసీపీ ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్ చేసిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుప్రీం కోర్టు చొరవతో రఘురామకు రాజద్రోహం కేసు నుంచి కాస్త ఊరట లభించింది. ఆ తర్వాత ఆయన ఏపీకి వచ్చేందుకు ప్రయత్నించగా..ఆయనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఆ వ్యవహారం తర్వాత ఆయన ఏపీకి రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా తాను ఏపీకి వచ్చేందుకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
సంక్రాంతి పండుగకు తను ఊరికి రావాలనుకుంటున్నానని, తనకు రక్షణ కల్పించాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. పోలీసులు ఆల్రెడీ తనపై 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశముందని పేర్కొన్నారు. రఘురామ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. గతంలో రఘురామను సీఐడీ అధికారులు అరెస్టు చేసి చిత్ర హింసలకు గురి చేశారని హైకోర్టుకు ఉమేష్ చంద్ర తెలిపారు.
అదేవిధంగా మరోసారి తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశముందని, అందుకే పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు.
అర్నేష్ కుమార్ కేసులో 41ఏ నిబంధనలను పాటించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తావించారు. దీంతో, రఘురామపై నిబంధనలకు విరుద్ధంగా ఎటుంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు విజ్ఞప్తి చేసింది. కానీ, రఘురామ పిటీషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. కేసు నమోదై, ఏడేళ్ల లోపు శిక్ష ఉన్న సెక్షన్లయితేనే 41 ఏ నిబంధనలు వర్తిసాయని పేర్కొన్నారు. రఘురామపై ప్రభుత్వం తాజాగా ఎలాంటి కేసులు పెట్టలేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రేపు ఉత్తర్వులను వెల్లడిస్తామని ప్రకటించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates