రాష్ట్రంలో కొత్త రాజకీయాలు పురుడు పోసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు అందరూ మరిచిపోయిన.. కాంగ్రెస్ పార్టీ వైపు పాతకాపులు ఇప్పుడు చూస్తున్నారు. అధికార వైసీపీలో టికెట్ దక్కని నాయకులు.. పొలో మంటూ కాంగ్రెస్ బాటపడుతున్నారు. గతంలో ఎవరైతే.. ఈ పార్టీని భూస్థాపితం చేశారో.. ఎవరైతే.. పార్టీని కూకటి వేళ్లతో సహా పెకలించారో వారంతా ఇప్పుడు హస్తం వైపు చూస్తున్నారు. ఆ పార్టీలో చేరుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. ఉండరన్నట్టుగా.. ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా ఇదే వర్తించనుంది.
ఈ వరుసలో ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం రెడీ చేసుకున్నారు. పార్టీ ఏపీ మాజీ చీఫ్ రఘువీరా రెడ్డిని ఆయన కలుసుకోవడం.. ఏకంగా పాదాభివందనం చేయడంవంటివి మీడియా లో ప్రముఖంగా వచ్చాయి. గత రెండు ఎన్నికల్లోనూ వరుసగా వైసీపీ టికెట్ పై విజయం దక్కించుకున్న కాపు.. గతంలో కాంగ్రెస్ నేతగానే ఎదిగారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం ఆయనకు పెట్టని కోటగా ఉండేది. కాంగ్రెస్‌ను బలోపేతం చేసిన నాయకుల్లో ఆయన కూడా ఒకరు.
అయితే.. ఇప్పుడు ఆ టీం అంతా వైసీపీకి అనుకూలంగా మారిపోయింది. వైసీపీతో ఎడతెగని అనుబంధం పెంచుకుంది. అనూహ్యంగా కాపు అయితే.. పార్టీ మారారు. కానీ, ఆయన వర్గం ఇప్పుడు కాంగ్రెస్ వైపు మళ్లుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. కాంగ్రెస్‌కు మద్దతిచ్చినా.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. పోనీ.. ప్రధాన ప్రతిపక్షంగా అయినా నిలదొక్కుకుంటుందా? అంటే అది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది.
ఇలాంటి సమయంలో పోయి పోయి అప్రాధాన్యా పార్టీ వైపు ఎవరు మాత్రం నిలబడతారనేది కేడర్ ప్రశ్న. అధికారంలోకి రావడమో.. లేక ప్రధాన ప్రతిపక్షంగా అయినా ఉండడమో చేస్తే.. ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని లెక్కులు వేసుకుంటున్న రాయదుర్గంలోని కాపు కేడర్.. కాంగ్రెస్‌లోకి వెళ్లే ఉద్దేశం ఉంటే.. తాము దూరమేనని చెప్పేస్తున్నారు. అయితే.. స్వతంత్రంగా పోటీ చేస్తే మాత్రం తమ సహకారం ఉంటుందని వెల్లడిస్తున్నారు. “ఆయనకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి.. కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు. మేం వైసీపీలో నే ఉంటాం. కాదంటే.. ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే.. అప్పుడు ఆయన వెంటే నడుస్తాం” అని సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తుండడం గమనార్హం.