వైసీపీలో మరో వికెట్..ఎంపీ సంజీవ్ గుడ్ బై

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలలో కొందరికి జగన్ స్థానచలనం కల్పిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలో అసమ్మతి రాగం తీవ్రంగా వినిపిస్తోంది. చాలామంది వైసీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉండగా..మరికొందరు జనసేన, టీడీపీ, కాంగ్రెస్ లో చేరబోతున్నామని ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీలో మరో వికెట్ పడింది. వైసీపీకి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గుడ్ బై చెప్పారు.

ఎంపీ పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు సంజీవ్ కుమార్ ప్రకటించారు. 2 రోజుల్లోనే స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తానని తెలిపారు. అయితే, ఏ పార్టీలో చేరాలన్న సంగతి నిర్ణయించుకోలేదని వెల్లడించారు. సీఎం జగన్ ను కలిసేందుకు ఫోన్ చేశానని, కానీ అది రిసీవ్ చేసుకోలేదని సంజీవ్ కుమార్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. పార్టీలో బీసీలకు పెద్దపీట వేస్తామని చెబుతుంటారుని, కానీ, చేతల్లో అది అమలు కాదని సంజీవ్ కుమార్ ఆరోపించారు.

రాబోయే ఎన్నికలలో కర్నూలు లోక్ సభ టికెట్ ను మంత్రి గుమ్మనూరు జయరాంకు కేటాయించేందుకు జగన్ మొగ్గు చూపుతున్నారని, ఈ నేపథ్యంలోనే సంజీవ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

కాగా, సంజీవ్ కుమార్ తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ కోరగా…ఆయన నేరుగా జగన్ కే నో చెప్పారు. దీంతో, ఆయన స్థానంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు జగన్ రెడీ అయ్యారట. దీంతో, లావు టీడీపీ తరఫున నరసరావుపేట ఎంపీగా బరిలోకి దిగే అవకాశాలున్నాయిన తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించి మూడో జాబితా విడుదల కాగానే మరిన్ని వికెట్లు పడతాయని టాక్ వస్తోంది.