కేసీయార్ పరిపాలనలో జరిగిన వ్యవహారాలన్నీ ఒక్కోటిగా బయటపడుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ డొల్లతనం, ధరణి పోర్టల్ అక్రమాలు, వివిధ శాఖల వేల కోట్ల రూపాయల రుణాలు, లక్షల కోట్ల అప్పులన్నీ ఇపుడు అంకెలతో సహా బయటపడుతున్నాయి. కేసీయార్ పాలనలో కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు పాల్పడిన భూకబ్జాలు, మోసాలు తదితరాలపై ఫిర్యాదులు వెల్లువుత్తుతున్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్లుగా తాజాగా నాలుగు కంప్యూటర్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. అప్పట్లో మంత్రులుగా పనిచేసిన కొందరు ఆపీసుల నుండి కీలకమైన ఫైళ్ళు మాయమైన విషయం తెలిసిందే.
వివిధ శాఖల్లో కొన్ని కీలకమైన ఫైళ్ళు మాయమవ్వగా మరికొన్ని శాఖల్లోని ఫైళ్ళు తగలబడిపోయాయి. ఇపుడు విషయం ఏమిటంటే ప్రగతిభవన్ నుండి నాలుగు కంప్యూటర్లు మాయమైపోయినట్లు తాజాగా బయటపడింది. ప్రగతిభవన్ అంటే కేసీఆర్ అడ్డా. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాత్రే ప్రగతిభవన్ నుండి నాలుగు కంప్యూటర్లను ఒక వ్యక్తి కారులో తీసుకెళ్ళినట్లు అధికారులు గుర్తించారని సమాచారం.
ఫలితాలు వచ్చిన రోజు అర్ధరాత్రి ప్రగతిభవన్ లోకి ఒక వ్యక్తి కారులో వచ్చారట. భవనంలోకి వెళ్ళి నాలుగు కంప్యూటర్లను తీసుకుని కారులో పెట్టుకుని వెళ్ళినట్లు బయటపడింది. ఇది ఎలాగ బయటపడిందంటే భవనంలోని సీసీ కెమెరాల ఫీడ్ ను చెక్ చేస్తున్నపుడు సడెన్ గా ఈవిషయం బయటపడిందని తెలిసింది. సీసీ కెమెరాలో రికార్డయిన టైం, డేట్ ప్రకారం డిసెంబర్ 3వ తేదీన అర్ధరాత్రి అని తేలింది. కారులో కంప్యూటర్లను తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరు ? కారు ఎవరిది అనే విషయాలపై విచారణ మొదలైందట.
కంప్యూటర్లు కేసీయార్ కుటుంబ సభ్యులవా లేకపోతే ప్రభుత్వానివా అన్న విషయంలో క్లారిటి రావటం లేదు. ప్రగతిభవన్లో ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని కంప్యూటర్లు పనిచేశాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వివిధ శాఖలతో సమన్వయం కోసం కొందరు ఉద్యోగులు ప్రగతిభవన్లోనే ఉండి పనిచేశారు. బహుశా వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్లలో కొన్నింటిని గుర్తుతెలీని వ్యక్తి బయటకు తీసుకెళ్ళుండచ్చని అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని హార్డ్ డిస్కులు కూడా మాయమయ్యాయని గుర్తించారు. అప్పట్లో ప్రగతిభవన్ సెక్యూరిటి అధికారికి నోటీసులు ఇచ్చి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు జరుగుతన్నాయట. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.