ఏపీ సీఎం జగన్‌ను శపిస్తానంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు.. ప్రముఖ సువార్తీకులు కిలారి ఆనందపాల్ హెచ్చరించారు. మంగళవారం ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు తాడేపల్లి రోడ్ల మీదే హల్చల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీతో పొత్తు పెట్టుకుని.. మరోసారి జగన్ ను ముఖ్యమంత్రి చేయాలన్న కాంక్షతో .. ఆశయంతో .. తాను తాడేపల్లికి వచ్చినట్టు చెప్పారు. అయితే.. తాడేపల్లి పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు.. పాల్‌ను లోపలికి అనుమతించలేదు.
దీంతో రెండు మూడు గంటల పాటు.. సమీపంలోని టీకొట్లు, చెట్ల కిందే పచారీ చేసిన పాల్.. వచ్చిన ప్రతిమీడియా ప్రతినిధితోనూ చిట్ చాట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 175 సీట్లలో విజయం దక్కించుకుంటుందని అన్నారు. తనతో జగన్ పార్టీ పొత్తు పెట్టుకుంటే వారికే మంచిదన్నారు. మరోసారి ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ జగన్ కోల్పోకుండా ఉండాలంటే.. మాతో పొత్తు పెట్టుకోవడం ఒక్కటే మార్గమని వ్యాఖ్యానించారు. ఇలా.. ఆయన చాలా సేపు తాడేపల్లి రోడ్లపై హల్చల్ చేశారు.
అయితే.. ఎంతకీ సీఎంవో నుంచి ఎలాంటి సందేశం రాలేదు. దీంతో కొంత అసహనానికి గురైన పాల్.. తనకు అప్పాయింట్ మెంట్ ఇచ్చేందుకు జగన్ భయపడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మా పార్టీనే ఆయనను ఓడిస్తుందని ఆయనకు కూడా తెలిసిపోయిందని.. అందుకే అప్పాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. అయితే.. అప్పాయింట్‌మెంట్ ఇచ్చే వరకు తాను ఇక్కడే ఉంటానన్న ఆయన.. అప్పాయింట్‌మెంట్ ఇవ్వని పక్షంలో సీఎం జగన్‌ను శపిస్తానని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత.. సీఎం జగన్.. మాజీ సీఎం జగన్ అయిపోతాడని అన్నారు. మొత్తానికి ఈ కామెంట్లు నవ్వులు పూయిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates