రాబోయే ఎన్నికల్లో సీనియర్ తమ్ముడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. నిజానికి ఆలపాటి తెనాలి అసెంబ్లీ సీటును దాటి ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. కానీ ఇపుడు పరిస్ధితులు మునుపటిలా లేవు. ఎందుకంటే తెనాలిలో టికెట్ దక్కేది దాదాపు అనుమానమే. కారణం ఏమిటంటే జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ ఇక్కడి నుండి పోటీచేస్తుండటమే.
ఆలపాటి, మనోహర్ ఇద్దరిదీ తెనాలి నియోజకవర్గమే. ఇద్దరు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. మామూలుగా అయితే తెనాలిలో ఆలపాటిని కాదని చంద్రబాబు మరోకరికి టికెట్ ఇవ్వరు. కానీ ఇపుడు పరిస్ధితులు వేరుగా ఉన్నాయి. ఎలాగంటే తెనాలిలో మనోహర్ పోటీచేయటం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చాలా ప్రిస్టేజ్. పార్టీలో తనతర్వాత తనంతటి మనోహర్ కే టికెట్ సాధించుకోలేకపోతే పవన్ కు చాలా అవమానం.
ఇదే సమయంలో తెనాలిలో ఆలపాటి పోటీచేయటం చంద్రబాబునాయుడుకు ఏమంత ప్రిస్టేజియస్ ఇష్యూకాదు. ఎందుకంటే ఆలపాటి లాంటి సన్నిహితనేతలు చంద్రబాబుకు పార్టీలో ఇంకా చాలామందున్నారు. కాబట్టి నాదెండ్లకు తెనాలి టికెట్ కోసం పవన్ పట్టుబట్టేట్లుగా ఆలపాటి కోసం చంద్రబాబు పట్టుబట్టరు. కాబట్టి తెనాలి టికెట్ నాదెండ్లకు దాదాపు ఫైనల్ అయినట్లే అనుకోవాలి. అందుకనే ఆలపాటికి స్ధానచలనం తప్పదు. ఎంఎల్ఏగా ఇతర నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశంలేదు కాబట్టి గుంటూరు ఎంపీగా పోటీచేయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు.
ఇక్కడ ఇంకో సమస్య ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో పోటీకి, పార్టీకి దూరంగా ఉండాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పేశారు. కాబట్టి గుంటూరులో బలమైన అభ్యర్ధిని నిలబెట్టాల్సిన అవసరం చంద్రబాబుకు వచ్చింది. ఎలాగూ గుంటూరు పార్లమెంటు పరిధిలో తెనాలి అసెంబ్లీ చాలా కీలకమైన నియోజకవర్గమే. సీనియర్ ఆలపాటిని గుంటూరు ఎంపీగా పోటీచేయిస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని చంద్రబాబు అనుకున్నట్లు సమాచారం. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆలపాటి తెనాలి నుండి కాకుండా గుంటూరు ఎంపీగా పోటీచేయటం దాదాపు ఖాయమనే అనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates