మరో రెండు మాసాల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు కీలక మలుపు తిరుగుతు న్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించే ధ్యేయంతో ఇప్పటికే టీడీపీ-జనసేన చేతులు కలిపాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకునేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే వైఎస్ తనయ షర్మిలను ఏపీ ఇంచార్జ్‌గా నియమించేందుకు రెడీ అయింది. దీనిపై ప్రకటనే రావాల్సి ఉంది. అది కూడా ఈ నెలలోనే జరగనుంది. అయితే.. ఇంతలో తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఏపీలో సీఎం జగన్ పని అయిపోయిందని తాజాగా సీఎం రేవంత్ అన్నారు. అంతేకాదు, షర్మిలకు అండగా ఉండాలని పార్టీ అధిష్టానం కనుక ఆదేశిస్తే.. వెంటనే తాను సహకరించేందుకు సిద్ధంగా ఉంటానని కూడా చెప్పారు. ఈ పరిణామాలతో రేవంత్ కలిసి వస్తే.. షర్మిలకు సాయం చేస్తే.. సీఎం జగన్ కు నష్టం ఎంత? అనేది ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం. గత ఎన్నికల సమయంలో రేవంత్ టీడీపీకి సహకరించారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు.
ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్‌కు సహకరిస్తూ.. జగన్ను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తే.. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది ప్రశ్నగా మారింది. వాస్తవానికి ఏపీలో రెడ్డి నాయకులు రేవంత్ మాట వింటారా? అంటే.. కొంత వరకు వినే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలోని రెడ్డి వ్యాపారులు.. హైదరాబాద్ కేంద్రంగానే తమ వ్యాపారాలను చేస్తున్నారు. వచ్చే ఐదేళ్ల పాటు రేవంత్ ప్రభుత్వమే అక్కడ ఉంటుంది కనుక.. వారు ఆయన మాట వినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అయితే..రేవంత్ మాట విన్నప్పటికీ.. అది పరోక్షంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరిగేందుకు మాత్రమే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల వైసీపీకి వచ్చే నష్టం పెద్దగా ఉండదని మరికొందరు అంచనా వేస్తున్నారు. అంటే.. ప్రత్యక్షంగా వైసీపీకి ఎలాంటి నష్టం ఉండదని అంటున్నారు. నేరుగా రెడ్డి నేతలు పోయి పోయి.. కాంగ్రెస్‌లో చేతులు కలపరని, ఏదైనా ఉన్నప్పటికీ.. అంతా పరోక్షంగా చూసుకుంటారే తప్ప.. ప్రత్యక్షంగా వైసీపీకి ఎదురు తిరిగే పరిస్థితి ఉండబోదని అంచనా వేస్తున్నారు. సో.. దీనిని బట్టి రేవంత్ ఏపీలో చక్రం తిప్పినా.. ఆయన అనుకున్న విధంగా జగన్‌కు పెద్దగా నష్టం చేకూర్చే అవకాశం ఉండబోదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.