ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు.. పాలిటిక్స్‌ను వేడెక్కిస్తున్నాయి. వైసీపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి టికెట్ల కేటాయింపు నడుస్తోంది. ఇప్పటికి చాలా మంది సిట్టింగులను పార్టీ పక్కన పెట్టింది. సర్వేల ఆధారంగా.. ప్రజల్లో ఉన్న అసంతృప్తి కారణంగా ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా పక్కన పెట్టడం గమనార్హం. మరికొందరిని నియోజకవర్గాల నుంచి ట్రాన్స్‌ఫర్ చేసింది. దీంతో కొందరు ఎమ్మెల్యేలు సర్దుకు పోతుండగా.. మరికొందరు మాత్రం పార్టీ మారేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇలాంటి వారిలో ఇంకా టికెట్‌పై ఎలాంటి ప్రకటన చేయని నాయకుడు, పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు కొలుసు పార్థసారథి పేరు తాజాగా తెరమీదికి వచ్చింది. ఇటీవల ఆయన సీఎం జగన్ తనను పట్టించుకోవడం లేదని.. ప్రజలైనా పట్టించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు పార్టీలోనూ.. నియోజకవర్గంలోనూ చర్చకు దారితీశాయి. దీనిపై పార్టీ అధిష్టానం కొలుసును వివరణ కూడా కోరింది. ఇక, టికెట్ వ్యవహారంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అయితే.. ఎలానూ తనకు టికెట్ రాదని అనుకున్నారో.. లేక.. వైసీపీలో ఉండి కూడా అనవసరం అని భావించారో తెలియదు కానీ.. కొలుసు పార్టీ మారేందుకు ప్రయత్నాలుముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన హైదరాబాద్‌లో కలిసినట్టు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌పై ఎమ్మెల్యే పార్థసారథి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా పార్థసారథి గెలిచారు.
పెనమలూరు లేదా నూజివీడు నియోజకవర్గాల నుంచి పార్థసారథి సీటు ఆశిస్తున్నారు. పెనమలూరు టికెట్ ఇవ్వరని టీడీపీ నేతలు చెబుతున్నారు. పెనమలూరులో బలమైన నాయకుడు బోడే ప్రసాద్ ఉండడంతో టీడీపీ ఇక్కడి సీటును ఎవరికీ ఇచ్చే పరిస్తితి లేదు. ఈ నేపథ్యంలో ఆయన నూజివీడు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పార్థసారథి టీడీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైనట్టు సమాచారం. ఈ నెల 18వ తేదీన గుడివాడలో జరిగే సభలో టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాగా, ఇంతగా ప్రచారం జరుగుతున్నా కొలుసు మాత్రం మౌనంగా ఉన్నారు. దీనిని బట్టి ఆయన పార్టీ మార్పు ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates