ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు డాక్ట‌రేట్‌.. కానీ!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు డాక్ట‌రేట్ ఇస్తామంటూ.. ఓ యూనివ‌ర్సిటీ ముందుకు వ‌చ్చింది. ఆయ‌న‌ను సాద‌రంగా ఆహ్వానించింది. మీకు డాక్ట‌రేట్ ఇస్తాం తీసుకోండి.. అని తెలిపింది. అయితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ ఆహ్వానం, ఆఫ‌ర్‌పై నిశితంగా స్పందించారు. త‌న‌కు ఈ డాక్ట‌రేట్ అవ‌స‌రం లేద‌ని చెప్పారు. స‌మాజంలో త‌న‌క‌న్నా మేధావులు, నిపుణులు, విజ్ఞులు ఉన్నారని, వారిలో ఎవ‌రినైనా ఎంపిక చేసుకుని ఇవ్వాల‌ని సూచించారు. దీంతో స‌ద‌రు యూనివ‌ర్సిటీ వెన‌క్కిత‌గ్గింది.

ఇదీ విషయం..
తమిళనాడులోని ప్ర‌ముఖ ‘వేల్స్ యూనివర్సిటీ’ 14వ స్నాతకోత్సవానికి జ‌న‌సేన అధినేత‌ పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించింది. అంతేకాదు.. తాము డాక్టరేట్ ఇవ్వాల‌ని భావిస్తున్నామ‌ని, దీనిని స్వీకరించాలని వర్సిటీ కోరింది. డాక్టరేట్‌ను పవన్ కళ్యాణ్ తిరస్కరించారు. ఈ మేరకు ప‌వ‌న్ స‌ద‌రు యూనివ‌ర్సిటీకి లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తోన్నందున బిజీగా ఉన్నానని ప‌వ‌న్ త‌న‌ లేఖలో పేర్కొన్నారు. వర్సిటీ స్నాతకోత్సవానికి రాలేనని తెలిపారు. సమాజంలో తనకన్నా గొప్ప వ్యక్తులు ఉన్నారని.. వారికి డాక్టరేట్ ఇవ్వాలని సూచించారు. కాగా, స‌ద‌రు యూనివ‌ర్సిటీ డాక్టరేట్ ప్ర‌క‌టించ‌డం వెనుక‌ పవన్ క‌ళ్యాణ్ చేసిన సహాయ, సేవా కార్యక్రమాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, డాక్టరేట్‌ను పవన్ కళ్యాణ్ తిరస్కరించడంపై అతని అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు.