టీడీపీతో టచ్ పై బాలినేని కామెంట్స్

మాజీ మంత్రి, సీఎం జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహారం కొంతకాలంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రెండోసారి మంత్రి పదవి దక్కకపోవడంతో వైసీపీ అధిష్టానంపై అలకబూనిన బాలినేని ఇంకా అలకపానుపు దిగలేదని ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు, ఈసారి ఎన్నికల్లో బాలినేనికి జగన్ టికెట్ వేరే నియోజకవర్గం నుంచి కేటాయించబోతున్నారని, అది ఇష్టంలేని బాలినేని పార్టీ వీడేందుకు కూడా సిద్ధమయ్యారని పుకార్లు వచ్చాయి.

తన సిట్టింగ్ స్థానం ఒంగోలు నుంచే రాబోయే ఎన్నికలలో కూడా బాలినేని పోటీ చేసేందుకు సుముఖత చూపుతుండగా, గిద్దలూరు నుంచి బాలినేని పోటీ చేస్తే బాగుంటుందని జగన్ అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే బాలినేని పార్టీ మారుతున్నారని, టీడీపీ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారని ముమ్మరంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై స్పందించిన బాలినేని సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని బాలినేని ప్రకటించారు.

విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని, అందుకే మంత్రి పదవిని కూడా వదిలేసి జగన్ వెంట నడుస్తున్నానని బాలినేని చెప్పారు, సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు మారుస్తున్నారని, అది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ జగన్ కు, పార్టీకి అండగా ఉండాలని బాలినేని పిలుపునిచ్చారు. అయితే, తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని బాలినేని ఖండించారు. టిడిపి నేతలతో తాను టచ్ లో ఉన్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీనిచ్చారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ వెంటే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు.