మూడో జాబితా రెడీ అయ్యిందా ?

వైసీపీలో మూడో జాబితా సిద్ధమైనట్లు సమాచారం. తాడేపల్లి నుండి ఫోన్ వచ్చిందంటేనే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం రెండు మూడు రోజుల్లో మూడో జాబితాను జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోతున్నారట. ఇందుకు అనుగుణంగా చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలను పిలిపించుకుని జగన్ మాట్లాడారు. అందుబాటులోని సమాచారం ఏమిటంటే మూడోజాబితాలో 12 లోక్ సభ, 13 అసెంబ్లీ స్ధానాల్లో మార్పులుండే అవకాశాలున్నాయట.

ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ మార్పులుంటాయని తెలుస్తోంది. ఇప్పటికే మార్పులపై ఎంఎల్ఏలతో జగన్ స్పష్టంగా చెప్పేశారు. మొదటి జాబితాలో మంత్రులు, ఎంఎల్ఏలు కలిపి 11 మందితో లిస్టు ప్రకటించారు. తర్వాత ఇదే పద్దతిలో మరో 38 మందితో లిస్టును జగన్ ప్రకటించారు. తొందరలో మూడో జాబితాను ప్రకటించబోతున్నారు. కొందరు మంత్రులు, ఎంఎల్ఏలకు జగన్ టికెట్లు నిరాకరిస్తున్నారు. మరికొందరు మంత్రులు, ఎంఎల్ఏలకు నియోజకవర్గాలను మారుస్తున్నారు.

అలాగే కొందరు ఎంఎల్ఏలను ఎంపీలుగా పోటీచేయిస్తున్నారు. కొందరు ఎంపీలను అసెంబ్లీకి పోటీచేయమంటున్నారు. మామూలుగా ప్రతిపార్టీలో జరిగే వ్యవహారమే ఇది. కాకపోతే మార్పులు చాలా పరిమితస్ధాయిలోనే జరుగుతాయి. పోయిన ఎన్నికల్లో టీడీపీలో కూడా రెండు మార్పులు జరిగాయి. పాయకరావుపేట ఎంఎల్ఏ వంగలపూడి అనితని కొవ్వూరులో పోటీచేయించారు. అలాగే కొవ్వూరు ఎంఎల్ఏ జవహర్ ను తిరువూరులో చేయించారు. అప్పట్లో ఎవరూ దీనిగురించి పట్టించుకోలేదు. ఇపుడు అలాంటి మార్పులనే జగన్ చేస్తుంటే ఎందుకింత రాద్దాంతం జరుగుతోంది ? ఎందుకంటే జగన్ రెండు మూడు నియోజకవర్గాలతో పరిమితం కాలేదు. పెద్దఎత్తున మార్పులు చేస్తున్నారు.

టికెట్ల నిరాకరణ, నియోజకవర్గాల మార్పు వ్యవహారం పార్టీలో కూడా అలజడి రేపుతున్నది. జగన్ నిర్ణయం నచ్చని మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి ఎంఎల్ఏ పదవులతో పాటు పార్టీకి కూడా రాజీనామాలు ప్రకటించారు. మరికొందరు కూడా అసంతృప్తిగానే ఉన్నా రాజీనామాలు అయితే ప్రకటించలేదు. ఇంత భారీఎత్తున మార్పులు చేస్తున్న జగన్ ఏదో తన బుర్రకు తోచినట్లుగా అయితే చేయరని అందరికీ తెలిసిందే. మరి జగన్ లెక్కలేంటో ? ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.